కిషన్ స్పీడ్ పెంచాల్సిందేనా..సీఎం అవుతారా?

-

బీజేపీ సిద్ధాంతాలను అణువణువూ వంటబట్టించుకుని కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వారిలో కిషన్ రెడ్డి ఒకరు. ఆయన బీజేపీలో ఒక సామాన్యుడిగా ఒక‌నాడు ప్రవేశించారు. ఆయన బీజేపీకి తానే అన్నట్లుగా తరువాత కాలంలో ఎదిగారు. కిషన్ రెడ్డి విషయం తీసుకుంటే దూకుడు రాజకీయం తక్కువ. ఆయన సౌమ్యుడిగానే పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసినా కూడా కిషన్ రెడ్డి  తెలంగాణ వ్యాప్తంగా పార్టీని విస్తరించలేకపోయారు. ఆయన కూడా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ తరువాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. అనూహ్యంగా కేంద్ర మంత్రి అయ్యారు. ఇపుడు క్యాబినేట్ హోదా కూడా సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే పదవి ఇస్తూనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక కీలకమైన బాధ్యత కూడా కిషన్ రెడ్డి మీద పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కచ్చితంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన కర్తవ్యం కిషన్ రెడ్డి మీదనే ఉంది. ఆయన సీనియర్ నేత. పైగా ఒకనాడు తెలంగాణ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఇక కేంద్రంలో మంత్రిగా కూడా చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి తాను గెలవడమే కాదు, పార్టీని కూడా గెలిపించాలి. మరి ఈ బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న కిషన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ఆశీర్వాద యాత్ర తెలంగాణాలో పెద్దగా ప్రభావం చూపించ‌లేదు అంటున్నారు.

మరో వైపు చూస్తే ఆయన కంటే తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రలో బాగా దూసుకుపోతున్నారు అంటున్నారు. బండి సంజయ్ నోటి దూకుడుతోనే రాజకీయాల్లో బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయన ఎపుడూ టి‌ఆర్‌ఎస్ అధినాయకత్వం మీద విమర్శలు చేస్తూ, తన మీద వారు విమర్శలు చేసేలా చూసుకుంటున్నారు. నిజానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి జోరు చేయాల్సి ఉంది. కానీ కిషన్ రెడ్డి ఒక స్థాయి దాటి విమర్శలు చేయలేరు అంటారు. ఆయన మర్యాద పురుషోత్తముడుగా ఉండాలనుకుంటారు. అయితే తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి.

మాటకు మాట అన్నట్లుగా అక్కడ సీన్ ఉంది. పైగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక కధ మొత్తం మారుతోంది. దీంతో కిషన్ రెడ్డి తన స్వభావాన్ని మార్చుకుంటేనే బీజేపీ పెద్దలు పెట్టిన బాధ్యతలను కొంత అయినా నెరవేర్చగలరు అంటున్నారు. అదే టైమ్ లో ఆయన బండి సంజయ్‌ని కూడా కలుపుకుని పోవాల్సి ఉంది. ఇక బీజేపీలో అందరికీ  తానే పెద్ద దిక్కు అని నిరూపించుకోవాల్సి ఉంది. మరి కిషన్ రెడ్డి అలా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశలు ఉంటాయి. ఇంతకీ తెలంగాణా రాజకీయాల్లో కిషన్ రెడ్డిని కాబోయే సీఎం గా చూస్తున్నారా అన్నదే డౌట్ మరి.

Read more RELATED
Recommended to you

Latest news