కాంగ్రెస్‌కు మరో షాక్.. టీఆర్‌ఎస్‌లోకి కొల్లాపూర్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతోనే నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగా… తాజాగా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవాళ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సమావేశమైన హర్షవర్ధన్‌రెడ్డి ఆయనతో పార్టీలో చేరే అంశంపై చర్చించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతోనే నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలు, అభిమానులతో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

నా నియోజక వర్గ అభివృద్ధే నా లక్ష్యం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంట నడిచి నా నియోజకవర్గం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతా.. అని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.