తెలంగాణ పీసీసీ పదవి దక్కలేదనే బాధ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkat reddy)కి ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కడంపై విమర్శలు కూడా చేసేశారు. డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారని అన్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కను అన్నారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మారిపోతారని అంతా అనుకున్నారు. కానీ తాను కాంగ్రెస్‌లో ఉంటానని, పీసీసీ రాలేదనే బాధ ఉందని, అందుకే పీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని అన్నారు. అలాగే పదవులు వచ్చినవారు గాంధీభవన్‌లో ఉన్న సీట్లలో కూర్చుంటే సరిపోదని, ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు.
కోమటిరెడ్డి స్టేట్‌మెంట్‌కు రేవంత్ రెడ్డి సరైన రియాక్షన్ ఇస్తూ ముందుకెళుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఎడ్లబండ్లు, సైకిళ్లతో ర్యాలీలు చేయనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ 48 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు.
అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన విషయంపై పోరాటం చేయనున్నారు. కొవిడ్ కేసులు, మరణాలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న తప్పుడు లెక్కలపై గ్రామస్థాయి నుంచి నిజనిర్ధారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇంతవరకు పీసీసీ లేకపోవడంతో, తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దగా పోరాటాలు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణులు, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ పోరాటాల్లో రేవంత్ ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి.