జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నా.. కేటీఆర్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

-

ఇటీవలే జగ్గారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గుడి కడతానని జగ్గారెడ్డి ప్రకటించారు.

జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తాన్ని టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది కానీ.. సంగారెడ్డిని మాత్రం గెలుచుకోలేకపోయింది. దానికి కారణం జగ్గారెడ్డి. అక్కడ ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అటువంటిది.

ktr-not-interested-in-jaggareddy-to-take-into-trs-party

అయితే.. ఇప్పటికే తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇంకొంతమంది చేరుతున్నారు. ఈనేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే జగ్గారెడ్డి కూడా కారెక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. మిగితా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న టీఆర్‌ఎస్ అధిష్ఠానం.. ఎందుకో జగ్గారెడ్డి అనేసరికి వెనక్కి జరుగుతోందట.

ఇటీవలే జగ్గారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గుడి కడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదట. అయితే.. దానికి కారణం కూడా ఉంది.

జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చింతా ప్రభాకర్‌కు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని హైకమాండ్ మాటిచ్చిందట. అంతే కాదు.. చింతా ప్రభాకర్ వర్గానికి, జగ్గారెడ్డి వర్గానికి అస్సలు పడదు. దీంతో జగ్గారెడ్డి పార్టీలోకి వస్తే… స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులన్నీ తారుమారు అవుతాయని.. అందుకే చింతా ప్రభాకర్ వర్గం జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కేటీఆర్ దగ్గర వాపోయిందట. అంతే కాదు.. జగ్గారెడ్డి వల్ల భవిష్యత్తులో లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పిందట. అందుకే.. కొన్నిరోజులు జగ్గారెడ్డిని పక్కన బెడదాం.. తర్వాత చూద్దాంలే అని కేటీఆర్ కూడా వదిలేశారట. అందుకే.. జగ్గారెడ్డి పరిస్థితి ప్రస్తుతం అటూఇటూ కాకుండా అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news