కేటీఆర్ పోరు..కాంగ్రెస్-కమలం ఎదురుదాడి.!

తెలంగాణ ఎన్నికల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య వార్ తీవ్రంగా జరుగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. అయితే ఇక్కడ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై రెండువైపులా నుంచి దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బి‌జే‌పి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి.

ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ పార్టీని గద్దె దించాలని రెండు పార్టీలు చూస్తున్నాయి. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా రెండు పార్టీలపై ఫైట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఈ బాధ్యతని కే‌టి‌ఆర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కాంగ్రెస్, బి‌జే‌పిల రాజకీయాన్ని కే‌టి‌ఆర్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బి‌జే‌పిలకు కే‌టి‌ఆర్ పెద్ద టార్గెట్ అవుతున్నారు. తాజాగా రజాకార్ సినిమా విషయంలో కే‌టి‌ఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఏవైనా మతపరమైన ఘర్షణలకు తెరతీస్తే..సినిమాని నిరోధించడానికి కూడా వెనుకాడమని అంటున్నారు.

తమ రాజకీయం కోసం కొందరు జోకర్లు మతపరమైన హింస ప్రేరేపించడానికి తమ శాయశక్తుల కృషి చేస్తున్నారని, తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డు తో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి కూడా తాము ఈ విషయాన్ని తీసుకువెళతామని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇక రజాకర్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లుకు ప్రాబ్లం గా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు.

అటు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై కే‌టి‌ఆర్ కౌంటర్ వేయగా, దానికి రేవంత్ రెడ్డి తిరిగి కౌంటర్ ఇచ్చారు. దళితుడుని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడమే కాకుండా..అనేక అంశాల్లో మాట తప్పిన దగాకొర్లని గద్దె దింపుతామని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తానికి బి‌జే‌పి, కాంగ్రెస్ రాజకీయాలకు కే‌టి‌ఆర్ చెక్ పెట్టాలని అనుకుంటే..కే‌టి‌ఆర్ పై ఆ రెండు పార్టీల నేతలు మాటల దాడి చేస్తున్నారు.