టీకాంగ్రెస్‌లో కేవీపీ రాజకీయం..ఎవరి కోసం?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లు పోరు నడుస్తోంది. పదవుల విషయంలో వీరి మధ్య చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. టి‌పి‌సి‌సి పదవుల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఉత్తమ్, భట్టి లాంటి వారు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో పార్టీలో సమస్య మరింత ముదిరింది.

దీంతో అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సరిచేయమని పంపించారు. ఇక రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్..నేతలతో భేటీ అయ్యి, వారి సమస్యలని తెలుసుకున్నారు. అయితే మెజారిటీ సీనియర్ నేతలు…రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్‌పై ఫిర్యాదులు చేశారని తెలిసింది. వారిని పదవుల నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే దిగ్విజయ్ ఈ అంశాలని అధిష్టానానికి చెబుతానని, అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అలాగే ఎవరు రోడ్డుకెక్కి పార్టీకి నష్టం చేయవద్దని, పార్టీలో విభేదాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని..దిగ్విజయ్ చేతులు జోడించి సీనియర్ నేతలని వేడుకున్నారట.

ఇలా కాంగ్రెస్‌లో విభేదాలకు దిగ్విజయ్ ఓ పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేశారట. కానీ ఈలోపే టీ కాంగ్రెస్ లో ఏపీ నేత కేవీపీ రామచంద్రరావు ఎంటర్ అయ్యారని తెలిసింది. ఆయన కూడా దిగ్విజయ్ తో ఏకాంతంగా భేటీ అయ్యారట. అయితే కేవీపీ దిగ్విజయ్ తో భేటీ కావడంపై తెలంగాణ సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆయన పైకి సీనియర్లకు మద్ధతు ఉన్నట్లు చెబుతూనే..పరోక్షంగా రేవంత్ రెడ్డిని వెనుక వేసుకోస్తున్నట్లు తెలిసింది. రేవంత్‌ని కాపాడటానికే కేవీపీ ఎంట్రీ ఇచ్చారని చెప్పి కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. మొత్తానికి కేవీపీ..రేవంత్ కోసం వచ్చారని అంటున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కేవీపీ పెత్తనం ఏంటని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version