టీ కాంగ్రెస్ లో అయోమయానికి ఆయనే కారణమా

అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. దాన్ని వ్యూహాత్మకంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన ఇన్ చార్జ్ పైనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాఫీగా పోయే దాన్ని సంక్షిష్టం చేశారని టాక్ మొదలైంది. రాహుల్ గాంధీకి ఎంత దగ్గరి వాడైనా..సీనియర్లను కూడా లైట్ గా తీసుకుంటే ఎలా అంటుటున్నారట. అందరిని కలుపుకుని పోవాల్సిన వ్యక్తి అందరినీ దూరం చేసుకుంటున్నారా..టీ కాంగ్రెస్ లో ప్రతిష్టంభనకి కారణమైన ఇంచార్జ్ ఠాగూర్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ పార్టీని బలోపేతం చేయగలుతురనుకున్నారు. ఆయన చెప్పిందే వేదంగా పాటించారు. ఇంతలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ మార్పుకు సంబందించిన అంశం తెరమీదకు రావటంతో ఠాగూర్ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. అనుకోకుండా ఠాగూర్ వన్ సైడ్ అయ్యారనే టాక్ మొదలైంది.సరళంగా జరిగిపోవాల్సిన పనిని..సంక్షిష్టం చేసి వివాదాలు కొని తెచ్చారని ఇప్పుడు అంతా ఆయన మీద గుర్రుగా ఉన్నారు.

మొదట్నుంచి కొంత దూకుడుగానే ఉన్న ఠాగూర్…. ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది వినడం లేదనే భావనలో పార్టీలో ఉంది. దుబ్బాక ఎన్నికల్లో కూడా నేతల మాట వినలేదనే టాక్ ఉంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పని చేయాలంటే సైలెంట్ అయ్యారట. ఠాగూర్ ఎలాగూ చెప్తే వినరు…ఆయన చెప్పిందే చెస్తే పోతుందనే అనే అభిప్రాయానికి వచ్చారట టీ కాంగ్రెస్ నేతలు. సొంతంగా ఆలోచన మానేసి ఠాగూర్ చెప్పిందానికి ఫాలో అయిపోతున్నారట . పీసీసీ చీఫ్ ఉత్తమ్.. సీఎల్పీ నేత భట్టి లాంటి నాయకులది కూడా ఇదే పరిస్థితి. పార్టీ వ్యవహారం ఎలా ఉన్నా, పీసీసీ నియామకం ప్రక్రియ వచ్చే సరికి… ఠాగూర్ చుట్టు వివాదాలు…విమర్శలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం… ఠాగూర్ యాటిట్యూడే అనేది పార్టీ వర్గాల్ల్లో వినిపిస్తున్న టాక్.

ఠాగూర్ తెలంగాణకు వచ్చేటప్పటికే ఫలానా వ్యక్తినే పీసీసీ ప్రెసిడెంట్ చేయాలనే డిసైడై వచ్చారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. వీహెచ్, మధుయాష్కీ, సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి అభిప్రాయంలోనే ఉన్నారట. అంతెందుకు పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ ఏకంగా… రేవంత్ రెడ్డికి ఠాగూర్ అమ్ముడు పోయాడనే రీతిలో కామెంట్ చేశారు. ఠాగూర్ కి ప్యాకేజీ ముట్టిందనే వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక ప్రక్రియ వివరాలు ఠాగూర్ నుంచే లీకవుతున్నాయనే అభిప్రాయాలు జగ్గారెడ్డి కూడా వ్యక్తం చేశారట.

మరోపక్క పీసీసీ చీఫ్ నియామకం పై తన అభిప్రాయం కూడా తీసుకోలేదన్న ఫీలింగ్ లో ఉన్నారట ఉత్తమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఇంచార్జ్ ఠాగూర్ లైట్ తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. ఉత్తమ్ టీమే కాదు..పార్టీలో చాలా మంది ప్రస్తుతం జరుగుతున్న రచ్చ కి కారణం ఠాగూరే అని భావిస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రాస్ రోడ్ లో ఉంటే సైలెంట్ గా చక్కదిద్దాల్సింది పోయి ఇప్పుడు మరింత చిక్కుల్లో పడేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోపక్క పీసీసీ చీఫ్ విషయంలో ఇక్కడ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోలేదనే వాదనా పార్టీ శ్రేణుల్లో ఉంది.

ఈ పరిస్థితుల్లో త్వరలో సీనియర్లు సమావేశమై, అధిష్టానానికి లేఖ రాయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రెండు కీలక పదవులను రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే, బీసీలు ఏం చేయాలనే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. చివరికి సీనియర్ నేత జానారెడ్డి మీరు ఎవరికైనా పీసీసీ చీఫ్ పదవి ఇచ్చుకోండి అంటు నిష్టూరంగానే చెప్పేశారట. ఈ వ్యవహారం నాగార్జున సాగర్ ఎన్నికలపై పడకుండా ఉంటే అదే చాలని భావిస్తున్నారట. మొత్తానికి ఈ వ్యవహారంలో ఠాగూర్ వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి.