మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జైన్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్నారు. జైలు శిక్ష అనుభివస్తూ ఇలా చేయడంపై బీజేపీ భగ్గుమంటుంది.
ఆర్థిక నేరం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి మసాజ్ చేస్తూ ..కాళ్లు నొక్కిస్తారా అంటూ జైల్ అధికారుల తీరును తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోని వైరల్ కావడంతో ఆప్ నేతలు తీహార్ జైల్లో మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారంటూ కమలనాథులు విమర్శలు చేశారు.
ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఆ కేసులోనే ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆయనకు ఎలాంటి సౌకర్యాలు, మర్యాదలు జరుగుతున్నాయో కళ్లకు కట్టి చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకున్న విజువల్స్ బయటకు రావడంతో బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ మసాజ్ పార్లర్‌ను ప్రారంభించారా అని ప్రశ్నిస్తున్నారు.
ఆప్ సమాధానం ఏంటంటే..
తీహార్ జైల్లో మంత్రి సత్యేంద్ర జైన్‌కి సేవలు, మసాజ్ చేస్తున్న వీడియో సెప్టెంబర్ నెలదని..జైల్ అధికారులు వివరణ ఇచ్చారు.. అప్పటికి ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేదని మంత్రిగా కొనసాగుతూనే ఉన్నట్లుగా చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో, బీజేపీ నేతల విమర్శలను ఆప్ నేత మనీష్ సిసోడియా ఖండించారు. సత్యేంద్రజైన్‌కి రెండు సర్జరీలు అయినందున ఆయన జైల్లో వీవీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నారని పేర్కొన్నారు. అంతే కాదు జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్న నేతను అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదన్నారు. ఫిజియోథెరపీ చేయించుకుంటున్న వీడియోని పట్టుకొని మసాజ్ సెంటర్ వీడియో అని బీజేపీ రిలీజ్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మండిపడ్డారు.
త్వరలో జరగబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆప్ నేతలు అంటున్నారు. జైల్లో అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి వీడియోని బయటపెట్టి లబ్ధి పొందాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.