రెడ్డి సామాజికవర్గానికే పెద్దపీట.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

-

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సామాజిక సమానత్వం పాటిస్తుందని అందరు భావించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అనుకున్నారు. కానీ, ఎక్కడా అలాంటి ఆలోచన చేయలేదని స్పష్టంగా తెలుస్తున్నది. ఎలాంటి సామాజిక సమీకరణాలను పట్టించుకోలేదని స్పష్టమవుతున్నది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి, హుజూర్‌బాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ కోటాలో బండ ప్రకాష్, ఎస్సీ కోటాలో కడియం శ్రీహరి నామినేషన్ పత్రాలను సమర్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీసీ కార్డు ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి కనీసం రెండు ఎమ్మెల్సీలైనా దక్కుతాయని అందరు భావించారు. ఎల్.రమణ, ఆకుల లలిత, కోడూరి సత్యనారాయణ గౌడ్ తదితర నేతలు టికెట్ ఆశించారు. కానీ, వారికి ఆశాభంగమే మిగిలింది.

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దూకుడుతో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో దళిత సామాజిక వర్గానికి కూడా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తారని భావించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మంత్రి మోత్కుపల్లిల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. అయితే, కడియం శ్రీహరికి మాత్రమే అవకాశం దక్కింది. మిగతా ఇద్దరి అభ్యర్థిత్వాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదని సమాచారం.

బీజేపీ కేంద్రంగా బీసీ సామాజికవర్గం కేంద్రీకృతం అవుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా బలమైన రెడ్డి సామాజికవర్గం బలమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కేంద్రంగా రెడ్డి సామాజిక వర్గం కేంద్రీకృతమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి టీఆర్‌ఎస్ పెద్దపీట వేసినట్లు కనిపిస్తున్నది. ఒక రకంగా రేవంత్‌రెడ్డి చుట్టూ ఆ సామాజిక వర్గ నేతలు చేరకుండా ఉండటం లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news