నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు అయితే ఇయన ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
ఏపీలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుంటే అధికార పార్టీ టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న విషయం విదితమే. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలతోపాటు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావులు తెరాసలో చేరేందుకు సిద్ధమవగా వీరి బాటలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు అయితే ఇయన ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఇప్పటికే ఈయన సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారని సమాచారం. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు దూరంగా ఉంటున్నారని, తెరాసలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నందునే ఆయన ఆ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిసింది. అందులో భాగంగానే ఆయన నేడో, రేపో తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించడంతోపాటు తెరాసలో కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా 2018 డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరాలని నిర్ణయించుకోవడం మాత్రం నిజంగా కాంగ్రెస్‌కు పెద్ద షాకే అని చెప్పవచ్చు..!