చంద్రబాబు కేబినెట్లో ఒక్క ఖాళీ.. అదృష్టం ఎవరికి దక్కుతుందో

-

ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 24 మందిని తన క్యాబినెట్‌లోకి చేర్చుకున్నారు. మరొక్క స్థానం ఖాళీగా ఉంచారు. టీడీపీకి చెందిన చాలామంది సీనియర్లు ఆ ఒక్క పోస్ట్ ని కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఏపీ క్యాబినెట్‌లో 25 మందిని చేర్చుకోవచ్చు. కానీ చంద్రబాబు 24 మందిని చేర్చుకుని ఒక్క ఖాళీని వదిలేశారు. ఇలా ఆ ఒక్కటి ఎందుకు భర్తీ చేయలేదని మంత్రివర్గం కొలువుదీరిన నుంచి ఇప్పటివరకు తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు. దీని వెనకాల బాబు వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు ఆ ఒక్కటి భర్తీ చేస్తారా అంటే అది కూడా గ్యారంటీ అనిపించడం లేదంటున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రి పదవిని ఆశించే వారు టీడీపీలో చాలామందే ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలతోపాటు కొందరు ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన సీనియర్లు కూడా ఉన్నారు. కొందరు సీనియర్లకు ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌ పదవులు కట్టబెట్టనున్నారు. ఐతే ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవిపై పలువురు సీనియర్లు కన్నేశారు. సీఎంపై ఒత్తిడి పెంచేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చాలా మంది మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా, కళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్‌ కూడా బెర్త్‌ ఆశిస్తున్నారు. ఇక విజయనగరం నుంచి కళావెంకటరావు, విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిపై ఆశతోనే కాలం గడుపుతున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అలాగే మండలి బుద్ధప్రసాద్‌, ధూళిపాల్ల నరేంద్ర, ఆలపాటి రాజా కూడా అమాత్య పదవి కోసం తహతహలాడుతున్నారు.

ఇక నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందిన కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి వంటివారూ సైతం మంత్రిగిరి పట్టేందుకు ఎదురుచూస్తున్నారు. అటు బీజేపీ, జనసేన నుంచి కూడా మరో మంత్రి పదవిని కోరుతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల ఫెర్ఫార్మెన్స్‌ సరిగా లేకపోతే కేబినెట్ నుంచి తొలగిస్తారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా గట్టిగా పనిచేసుకుంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా విస్తరణ జరిగీతే పదవి పోతుందేమో అనే భయంలో కొత్త మంత్రులు ఉన్నారు. మొత్తానికి ఆ ఒక్క మంత్రి పదవి ఇంతమందిని టెన్షన్ కి గురిచేస్తోందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news