ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు బాగా హాట్ గా మారుతున్నాయి. పార్టీల మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో రాజకీయ పోరు తీవ్రమైంది. ఇక్కడ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, కాంగ్రెస్ లోని కొండా ఫ్యామిలీకి వార్ నడుస్తుంది.
గత ఎన్నికల్లో చల్లా..కొండా సురేఖపై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి చల్లాని ఓడించాలని కొండా ఫ్యామిలీ చూస్తుంది. ఆయనకు చెక్ పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి పరకాలలో కొండా మురళి గాని, ఆయన కుమార్తె సుస్మితా పటేల్ గాని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ బరిలో దిగనున్నారు. ఇక కొండా మురళి పరకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కొండా, చల్లా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది.
ఈ మధ్య మంత్రి కేటిఆర్‌కు కొండా కౌంటర్ ఇచ్చారు..ఆ నెక్స్ట్ చల్లా..కొండాపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు కొండా..చల్లా టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ‘‘ధర్మారెడ్డి.. డేటు.. టైము చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా! అని కొండా సవాల్ చేశారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో తేల్చుకుందామని అన్నారు. పార్టీ అవకాశం ఇస్తే పరకాలలో పోటీ చేస్తానని, ధర్మారెడ్డి అంతు తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ధర్మారెడ్డి మట్టి దొంగ. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు తన దగ్గరకు వస్తున్నారని, మైసమ్మ సాక్షిగా పరకాలలో ధర్మారెడ్డిని ఓడిస్తానని సవాల్ చేశారు. ఇలా కొండా సవాల్ చేయడంతో పరకాల రాజకీయం వేడెక్కింది. మరి ఈ సారి పరకాల పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.