పరిగి పోరు: మహేష్ వర్సెస్ రామ్మోహన్..పైచేయి ఎవరిది?

-

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం..రాజకీయంగా పెద్దగా హడావిడి లేని నియోజకవర్గం. రాష్ట్ర స్థాయిలో ఈ స్థానంలో రాజకీయాలు పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు తక్కువే. సైలెంట్ గానే ఇక్కడి రాజకీయాలు సాగుతాయి. అయితే అలాంటి చోట ఈ సారి రాజకీయ పోరు ఆసక్తికరంగా సాగేలా ఉంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిగి అనేది గతంలో టి‌డి‌పి కంచుకోట ..ఇంకా చెప్పాలంటే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కంచుకోట.

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కొప్పుల..1985 నుంచి విజయాల బాటపట్టారు. 1985లో పరిగిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ని ఓడించి టి‌డి‌పి జెండా ఎగరవేశారు. 1989లో ఓటమి పాలైన మళ్ళీ తిరిగి పుంజుకుని..1994,1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. అంటే అక్కడ కొప్పులకు ఎంత ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ తర్వాత తెలంగాణలో టి‌డి‌పి దెబ్బతినడంతో బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు.

ఈ క్రమంలోనే 2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి టి. రామ్మోహన్ రెడ్డి గెలిచారు. ఇక తర్వాత కొప్పుల అనారోగ్యంతో మరణించారు. దీంతో 2018 ఎన్నికల్లో కొప్పుల తనయుడు మహేష్ రెడ్డికి సీటు ఇచ్చారు. దీంతో మహేష్ బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. అటు కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి పోటీ చేశారు. అయితే విజయం మాత్రం వన్ సైడ్ గా మహేష్‌కు వచ్చింది. 15 వేల ఓట్ల మెజారిటీతో మహేష్ గెలిచారు.

ఈ సారి ఎన్నికల్లో కూడా మహేష్ బి‌ఆర్‌ఎస్ నుంచి..రామ్మోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ రెండు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో బి‌జే‌పికి కేవలం 6 వేల ఓట్లే పడ్డాయి. ఇప్పుడు కూడా ఆ పార్టీకి పట్టు కనిపించడం లేదు. దీంతో పరిగిలో మహేష్, రామ్మోహన్‌ల మధ్యే పోరు నడవనుంది. మరి ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news