పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, క్యాడర్ ను సంపాదించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి అధికార పార్టీని నిలదీస్తూ, విమర్శిస్తూ తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతుగా ఉంటారని తెలిసిన విషయమే. రాబోయే ఎన్నికల్లో కూడా టిడిపి జనసేన పొత్తు ఉంటుందని, ఇవి రెండూ కలిసి పోటీ చేస్తాయని ప్రచారంలో ఉంది. జనసేన ప్రస్తుతం బిజెపితో కూడా కలిసి ఉంది.
బిజెపికి టిడిపికి మధ్య వారధిగా పవన్ వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి, టిడిపి మధ్య పొత్తులు, పోటీ చేసే సీట్ల విషయంలో బిజెపి టిడిపికి జనసేనాని మధ్యవర్తిగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలన్ని ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ అధికార పక్షాల కుట్రని పవన్ నిరసన తెలిపారు. చంద్రబాబును చూసేందుకు పవన్‌కు అనుమతి లేదంటూ విమానయానం కుదరదంటే సొంత కారులో ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చారు. కారును ఆపితే నడిచి వెళతా అంటూ ఆందోళన చేశారు. సొంత పార్టీ నేతల కన్నా చంద్రబాబు అరెస్టుకు జనసేనాని ఎక్కువగా స్పందించారని అధికార పార్టీ వారి విమర్శించినా, అదే నిజమని అందరూ అనుకున్నారు.
కానీ పవన్ మాత్రం తాను విశాఖలో పోలీసులు ఇబ్బందులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని, అందుకే అరెస్టు అయిన ఆయనను పరామర్శించేందుకు మాత్రమే వచ్చానని, తన రాకకు గల కారణాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి చేపట్టిన బందుకు జనసేన తన మద్దతును తెలిపింది . చంద్రబాబు నాయుడుకు పవన్ తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇప్పటివరకు బానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ బిజెపి సహకారంతోనే జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి . చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి బిజెపి నేతలు ఏ ఒక్కరు ఖండించలేదు. పైగా టిడిపి చేస్తున్న బంద్ కు బిజెపి మద్దతు లేదు. ఇప్పటివరకు బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయనే వార్తల గురించి నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు పవన్ పరిస్థితి అయోమయంలో ఉంది, ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు తో ఉంటారా? బిజెపితో కలిసి వెళతారా?వేచి చూడాల్సిందే.!