ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ తక్కువ కాలంలోనే ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన పెట్టిన మొదట్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఆ తర్వాత రెండు పార్టీలకు దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి పవన్…సిపిఐ, సిపిఎం, బిఎస్‌పి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
అయితే ఆ తర్వాత ఓడిపోయాక కమ్యూనిస్టులని పవన్ వదిలేశారు. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇక ఈ పొత్తు వల్ల పవన్‌కు పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా ఇంకా ఎక్కువగా నష్టపోతున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో ఎలాగో బీజేపీకి పవన్ అవసరం పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. అక్కడ బీజేపీ నాయకులు పవన్‌ని అసలు పట్టించుకోవడం లేదు.
అందుకే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పవన్ చివరి నిమిషంలో టీఆర్ఎస్‌కు మద్ధతు తెలిపారు. దీంతో బీజేపీకి షాక్ తగిలింది. అక్కడ నుంచి తెలంగాణ బీజేపీ నాయకత్వం పవన్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ బీజేపీ ఇంకా పవన్ సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు కనిపించడం లేదు. అయితే ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ ప్రభావం జనసేనపై కూడా పడుతుంది. అందుకే పవన్ సైతం నిదానంగా బీజేపీ నుంచి బయటకొస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో ఎలాంటి నిరసనలైన జనసేన ఒక్కటే చేస్తుంది. బీజేపీతో కలిసి పవన్ పోరాటాలు చేయడం లేదు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే బీజేపీకి మళ్ళీ పవన్ దూరమయ్యేలా కనిపిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే బీజేపీకి షాక్ ఇచ్చేయోచ్చని ప్రచారం జరుగుతుంది.