షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రక్రియ పూర్తి చేశారు. వచ్చే నెల 8న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. అయితే వైఎస్సార్ తనయురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు తెలంగాణ ప్రజల నుంచి పెద్దగా మద్ధతు రావడం లేదనే చెప్పొచ్చు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ఇప్పటివరకు షర్మిలకు సపోర్ట్‌గా పెద్ద నాయకులు ఎవరు రాలేదు. ఏదో చిన్నాచితకా నేతలు షర్మిల పార్టీలోకి వచ్చారుగానీ, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద తలకాయలు ఎవరు పార్టీలో చేరలేదు. ముఖ్యంగా వైఎస్సార్‌ని అభిమానించే బడా నేతలు, షర్మిల వైపుకు రాలేదు. కానీ షర్మిల మాత్రం తాను తెలంగాణ కోడలిని అని చెబుతున్నారు. అందుకే ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకురావడానికి వచ్చానని చెబుతున్నారు.

అలాగే షర్మిల రాష్ట్రంలో పర్యటించడం మొదలుపెట్టేశారు. పలు సమస్యలపై కూడా స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అటు పలు రైతు కుటుంబాలని ఓదారుస్తున్నారు. ఈ విధంగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నా సరే ప్రజలు మాత్రం ఆమెకు మద్ధతుగా వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ షర్మిల రాజకీయాలు తెలంగాణలో వర్కౌట్ కావడం లేదు.

పైగా ఇటీవల తెలంగాణ-ఏపీ ప్రభుత్వాల మధ్య నీటి తగాదా జరుగుతుంది. జగన్ ప్రభుత్వం అక్రమంగా నీళ్ళు తరలించుకుపోతుందని కేసీఆర్ ప్రభుత్వం మండిపడుతుంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై షర్మిల స్పందించడం లేదు. ఎందుకంటే అటు పక్కన ఉన్నది తన అన్న ప్రభుత్వం. కాబట్టి షర్మిలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే, ఊహించని వ్యూహాలు ఆమెను ఇరుకున పెడుతున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో షర్మిల రాజకీయాలు ఏ మేర సక్సెస్ అవుతాయో?