మండే వేసవి కాలం ముంచుకొస్తున్న తరుణం. పోనీ ఏసీలూ, కూలర్లు వాడకపోయినా ఫ్యాన్ అయినా తిరగాలి కదా! నిరంతర విద్యుత్ ఎలానూ ఇవ్వడం లేదు అని గ్రామాల నుంచి రిపోర్టులు వస్తున్నాయి..ఈ పాటి దానికి విద్యుత్ ఛార్జీల వడ్డన ఎందుకు అని అడుగుతున్నారు గ్రామీణులు. అయినా అధికారంలోకి వచ్చి (దాదాపు) మూడేళ్లకు కదా ఛార్జీలు పెంచింది దీనివల్ల పెద్ద భారం ఏమీ ఉండదు అని కూడా అంటోంది వైసీపీ.
వంద యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగం చేసేవారికి (75 నుంచి 125 యూనిట్లు) ఇప్పటి పెంపు రూపాయి నలభై పైసలు. అంటే వంద యూనిట్లు లోపు వాడితే విద్యుత్ బిల్లులో పెరుగుదల 140 రూపాయలు పెరుగుదల. ఇది ఓ లెక్క. పైకి పైసల్లో లెక్కే అయినా వాటి విలువ కోట్లలో ఉంటుంది కదా! కనుక పెంపును సింపుల్ గా తేల్చేయడం కుదరని పని.
ఇప్పుడు రెండువందల యూనిట్లను వినియోగిస్తే ఇప్పటివరకూ ఉన్న బిల్లు ఏ పాటి పెరుగుతుందంటే.. 157 రూపాయలు అంటే యూనిట్ కు పెంపు 1.57పైసలు. అయినా కూడా ఈ పెంపు కూడా ఓ పెంపేనా అని వైసీపీ అంటే ఏం చేయలేం.. ఏం చెప్పలేం కూడా! అధిక ధరకు విద్యుత్ ను కొనుగోలుచేసి సరఫరా చేస్తున్నందునే ఇటువంటి సమస్య వచ్చి పడిందని జగన్ తనదైన వివరణ ఒకటి గతంలోనే ఇచ్చారు.
అప్పట్లో సర్దుబాటు ఛార్జీల పేరిట బిల్లుల పై ఛార్జీల బాదుడు బాదితే సంబంధిత సమస్యపై అధికారులు కూడా ఇలాంటి వివరణే ఇచ్చారు.ఇక మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడితే బిల్లు ఎంతౌంతుందో చూద్దాం.. బిల్లులో పెరుగుదల 116 రూపాయలు అంటే యూనిట్ కు పెంచిన ధర రూపాయి 16 పైసలు. ఆఖరుగా నాలుగు వందల యూనిట్లకు పైగా వినియోగిస్తే బిల్లులో పెరుగుదల యాభై ఐదు రూపాయలు.. అంటే యూనిట్ కు పెంపుదల యాభై ఐదు పైసలు.