కోవ‌ర్టుల‌ను క‌విత ఏరేస్తారా… టైం ఫిక్స్ అయ్యింది..!

-

కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయంగా కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిన ఆమె ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఏదేమైనా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా కవిత ఓడిపోవడం కేసీఆర్ కు సైతం రుచించడం లేదు.  అటు కవిత ఎంపీగా రెండోసారి గెలిచి ఉంటే రాజకీయంగా ఆమె తిరుగులేని విధంగా చక్రం తీప్పేవారు. ఇప్పుడు ఓడిపోవడంతో ఆమె ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది. ఇక తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణలో ఆ పార్టీ సత్తా ఏంటో మరోసారి రుజువు  అయింది.

ఈ నేపథ్యంలోనే కవిత మళ్లీ రాజకీయంగా బలపడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు ఏదో ఒక పదవి ఇస్తున్న కేసీఆర్ కరీంనగర్ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేత వినోద్ కుమార్ కు ప్రణాళికా సంఘం బాధ్యతలను అప్పగించారు. ఇక ఐదేళ్లపాటు ఎంపీగా ఉన్న కవిత పార్లమెంట్లో తెలంగాణలో పలు కీలక అంశాలపై తన వంతు పోరాటం చేశారు. ఎంపీగా గెలిచిన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమెను ఢిల్లీ రాజకీయాల్లో ఉంచేందుకు కెసిఆర్ క‌విత‌కు రాజ్యసభ పదవి ఇస్తార‌ని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అంతకంటే ముందే కవిత ఎంపీ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతల వెన్నుపోటు కారణం అన్న విషయం గుర్తించారు. కవిత ఎంపీ గా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలోని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపై ఉండేవారు. ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల అందరినీ ఆమె ఎంతో కష్టపడి మరి గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు లోపాయికారి ఒప్పందాలతో తనకు వెన్నుపోటు పొడిచారని ఆమె అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమె గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు.. వారికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త‌న ఓట‌మికి వారు ఎలా ప‌ని చేశారో ? తన సన్నిహితుల ద్వారా సాక్ష్యాధారాలను కవిత సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరెవరు తన విజయానికి కృషి చేయలేదో కవిత నివేదిక రూపంలో కేసీఆర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక తనకు రాజ్యసభ సీటు వచ్చినవెంటనే మళ్లీ ఆమె నిజామాబాద్ జిల్లాలోనూ, తెలంగాణ‌లోనూ రాజకీయంగా యాక్టివ్  అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కవితకు  ఢిల్లీ స్థాయి పదవి ఖరారు అయినా టైం ఎప్పుడ‌నేదే వెయిట్ చేయాల్స ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news