తెలంగాణ వచ్చాక అన్నీ వర్గాలకు న్యాయం చేశామని, అసలు ప్రతిపక్షాలకు పోరాటం చేయడానికి పెద్దగా ఏ అంశాలు లేవని, కానీ ఒక్క నిరుద్యోగ అంశమే ఉందని గతంలో మంత్రి కేటీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. అంటే తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు సరైన న్యాయం చేయలేకపోయామనే భావన అధికార పార్టీలో కూడా ఉంది. కానీ ఇటీవల వరుసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ ..నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండే కార్యక్రమాలు చేస్తుంది.
అయితే ఆ నిరుద్యోగ అంశాన్నే ఎజెండా గా చేసుకుని కాంగ్రెస్, బిజేపి రాజకీయం మొదలుపెట్టాయి. ఇటీవలే రాష్ట్రానికి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి..యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4 వేలు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్..చదువుకునే యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని..అధికారంలోకి రాగానే ఇవన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. దీంతో నిరుద్యోగ యువత కాస్త కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశాలు మెరుగు పడ్డాయి.
పైగా 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు..కానీ ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హామీతో నిరుద్యోగుల్లో మార్పు కనిపిస్తుంది. అదే సమయంలో బిజేపి సైతం నిరుద్యోగుల కోసం పోరాటం మొదలుపెట్టింది. తాజాగా సంగారెడ్డిలో బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. ఈ క్రమంలో నిరుద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ మాదిరిగానే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు.
తాము అధికారంలోకి రాగానే బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇలా బిజేపి, కాంగ్రెస్ నిరుద్యోగుల ఓట్ల పై వల వేస్తున్నాయి. మరి నిరుద్యోగులు ఎవరు హామీలని నమ్ముతారు..ఎవరికి ఓటు వేస్తారో ఎన్నికల సమయంలో తేలుతుంది.