సీనియర్లకు రేవంత్ చురకలు..బీఆర్ఎస్-బీజేపీ అడ్డంగా దొరికాయి.!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదవుల పంపకాలపై పెద్ద రచ్చ నడిచింది. దీంతో అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ వచ్చి..అందరి సమస్యలని తెలుసుకున్నారు. అంతా కలిసి పనిచేయాలని…ఎవరు రోడ్డుకెక్కి తిట్టుకోకూడదని సూచించి ఢిల్లీకి వెళ్లారు. అలాగే నేతల ఫిర్యాదులని అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు.

అయితే దిగ్విజయ్ రాకతో కాంగ్రెస్ లో కాస్త రచ్చ తగ్గింది. కానీ అంతర్గతంగా మంటలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే క్రమంలో తాజాగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్..పార్టీ గొప్పతనం, గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడి..ఆ తర్వాత సీనియర్లకు చిన్నగా చురకలు అంటించారు.  పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వ్యక్తిగత సమస్యలపై చర్చ పెట్టొద్దని నేతలని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని, మన సమస్యల కంటే ప్రజా సమస్యలు కీలకమని, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంపైనే చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

అయితే గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై రేవంత్ స్పందిస్తూ..ఇందులో ఎవరు దోషి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు కోణాలు చూడాలని, బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలని బాధితులుగా చూపిస్తున్నారని, మరి ఇందులో దోషి? ఎవరు అని ప్రశ్నించారు. కానీ విచారణ తామే చేస్తామని అనడం ద్వారా బీఆర్ఎస్ లోపం బయటపడిందని, నేరమే జరగలేదని చెప్పి..సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడిందని అన్నారు. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే బీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news