కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిపై సీతక్క-సురేఖ ఫైట్ !

-

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త చీఫ్‌ ఫైనల్‌ అయినట్టు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకు చర్చ జరుగుతోంది. దీంతో ఇక మిగిలిన పదవులపై పోటీ నెలకొంది. టీపీసీసీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి మహిళకు ఇవ్వాలనే డిమాండ్‌ తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ప్రచారం జరగడం వెనక కూడా కొందరు నాయకులు వ్యూహం ఉందన్నది గాంధీభవన్‌ వర్గాల టాక్‌. ఈ విషయంలోనే ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి కొండా సురేఖ మధ్య పొలిటికల్‌ వార్‌ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మహిళా నాయకులే కావడంతో ఓరుగల్లు రాజకీయం కూడా వేడెక్కుతోందట.


కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక సందర్భంగా ఏఐసీసీ తరఫున అభిప్రాయ సేకరణ నిర్వహించారు ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌. ఆ సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు ఠాగూర్‌ ఫోన్‌ చేశారు. చర్చలో సురేఖకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి అనే ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అప్పటి నుంచి వరంగల్‌ జిల్లా నాయకుల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ చర్చ ఇక్కడితో ఆగకుండా.. ఎమ్మెల్యే సీతక్కకు మహిళా కాంగ్రెస్‌ పదవి ఇస్తారని కూడా చర్చ తెరమీదకు వచ్చింది. ఆలు లేదు చూలు లేదన్నట్టు అప్పుడే ఈ పదవులపై సీతక్క, సురేఖల మధ్య వార్‌ ప్రారంభమైందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

సురేఖకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవి ఇస్తే.. పార్టీలో పట్టు సాధిస్తారని.. అప్పుడు సీతక్క ఇబ్బంది పడతారని పార్టీ వర్గాల టాక్‌. అందుకే సురేఖకు పదవి ఇస్తే వాళ్ల ఆధిపత్యంలో పనిచేయడం కుదరదనే ఫీలింగ్‌లో సీతక్క ఉన్నారట. ఇప్పటికే పార్టీలో సీతక్క రేవంత్‌ వర్గానికి చెందిన మనిషి అని ముద్రపడిన సందర్భంగా.. ఈ కొత్త చర్చ జోరందుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. సీతక్క ఏఐసీసీ మహిళా విభాగంలో కార్యదర్శిగా ఉన్నారు. అందుకే కొత్త పీసీసీ టీమ్‌లో ఆమెకు మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోందట. అయితే మహిళా కాంగ్రెస్‌ పదవి కంటే.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి పార్టీలో కీలకంగా భావిస్తున్నారట.

ఏఐసీసీ మహిళా విభాగంలో పనిచేసి పీసీసీకి రావడం.. ప్రమోషన్‌ కాదు డిమోషన్‌ అని సీతక్కను ఉద్దేశించి పార్టీలోని మరో వర్గం చర్చకు పెట్టిందట. దామోదర రాజనర్సింహ శిబిరానికి చెందిన ఇందిరా శోభా, మరో కాంగ్రెస్‌ నేత సునీతారావు సైతం మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌ పోస్ట్‌పై కన్నేశారట. ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌తో సన్నిహితంగా ఉండేవారి ద్వారా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ పదవి అన్నది ఢిల్లీ ఇంకా తేల్చలేదు. అక్కడి నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఈలోపుగా ఇక్కడి నేతల మధ్య పదవుల విషయమై గ్యాప్‌ పెరుగుతోంది. కమిటీ కొలిక్కి రాకుండానే కొట్లాటలు షురూ అయ్యాయి. మరి.. రానున్న రోజుల్లో ఈ తగాదాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news