కరోనా‌ విషయంలో జగన్ ని పక్కదారి పట్టిస్తున్న సీనియర్ ఐఏఎస్ లు

అధికారం మనదైతే అంతా బాగుందనే చెబుతారు. అలా చెబితేనే వినడానికి బావుంటుంది. ఇప్పుడు ఏపీలో కొందరు సీనియర్ ఐఏఎస్ ల తీరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. ఏపీ సర్కార్ గత కొద్ది రోజుల నుంచి కరోనా కట్టడిపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. కొవిడ్ కమాండ్ కంట్రోల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారికి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. వీరే అతిగొప్పలతో సీఎం జగన్ కి అసలు విషయాలు తెలియనివ్వడం లేదనే చర్చ జరుగుతుంది.

ఏపీలో కొంత మంది అధికారులు. అవసరానికి మించి బెడ్లు ఉన్నాయ్…ట్యాంకర్ల కొద్దీ ఆక్సీజన్ రెడీగా ఉంది. ఇలా కొవిడ్ సమీక్షల్లో అధికారులు మంత్రులకు అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రియాల్టీకి వచ్చే సరికి బయానక పరిస్థితులు..పరిస్థితి చేదాటిపోతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు విధానపరమైన నిర్ణయాలు తీసుకోగలరే గాని…అమలు చేయాల్సింది మాత్రం అధికారులు, సిబ్బందే. ఇక్కడే తేడా కొడుతోంది. క్షేత్రస్థాయి వాస్తవాలకు, అధికారులు పేపర్లపై చూపిస్తున్న లెక్కలకు అసలు పొంతన ఉండటం లేదు.

ఒకవైపు హాస్పిటళ్లల్లో బెడ్లు లేక కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ కోసం కటకటలాడే పరిస్థితి ఉంది. రెమిడెసివర్ బ్లాక్ మార్కెట్‌ను రాజ్యం ఏలుతోంది. చివరకు శ్మశానాలు కూడా ఖాళీలు లేక కిటకిటలాడుతున్నాయి. 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా వెంటనే తగిన సహాయం అందించే ఏర్పాటు చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అధికారులు మాత్రం మంత్రులను, ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో మభ్యపెడుతున్నారని తెలుస్తుంది. వేల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని..పరిశ్రమల నుంచి రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని మంత్రుల రివ్యూల్లో లెక్కలు చూపిస్తున్నారు అధికారులు.

వాస్తవానికి వస్తే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నా…కేటాయింపులు మాత్రం కేంద్రమే చేస్తుండటంతో ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాలి. దీనికి పట్టే ప్రయాణ సమయం, ఆక్సిజన్ రవాణా క్రయోజనిక్ ట్యాంకర్ల కొరత వంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ విషయాలను అధికారులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారనే విమర్శ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు…కొన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద ఉన్న కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లకు కూడా కరోనా చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టాకుండా అధికారులు చూపించే లెక్కలపైనే ఆధారపడితే…జగన్ సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ గొప్పలు చెప్పే అధికారులకు మాత్రం ఎలాంటి తేడా ఉండదు అని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.