తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా అన్నది అటుంచితే తరుచూ ఏవో ఒక గొడవలతో కాలం వెళ్లదీయడం కూడా అధికార పార్టీ నాయకులకు సబబు కాదన్న వాదన ఒకటి వినిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులను కూడా పెండింగ్ లో ఉంచుతూ కాలం గడపడంలో అర్థం లేదని ఇంకొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమయినప్పటికీ ఓ ఆస్పత్రి బాగు కోసం, ఓ రోగి మేలు కోసం, ఓ విధి శుభ్రత కోసం ఇంతగా ఆత్రపడితే రాజకీయాలు మెరుగున పడే అవకాశాలు మెండుగా ఉంటాయని, ఆ విధంగా కాకుండా వీటికి భిన్నంగా కొట్లాటకు, వాగ్వాదాలకు తావిస్తూ పోతే, ఇక రాజకీయ నాయకుల మనుగడే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇంకొందరు. ఏదేమయినప్పటికీ వైసీపీ, టీడీపీ నాయకులు పాలనలో తప్పిదాలు దిద్దకుండా, అనవసర గొడవల కారణంగా అశాంతిని రాజేయ్యడం ఏమంత సబబు కాదు.
ఈ నేపథ్యాన వరుస వివాదాలతో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గతంలో పలు సందర్భాల్లో కింజరాపు కుటుంబంతో కయ్యం పెట్టుకున్నాక, రాజకీయంగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. సవాళ్లనూ అదే సమయంలో ఎదుర్కొన్నారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్లనూ భరించాల్సి వచ్చింది. కేవలం ఆయన వ్యవహార శైలి కారణంగానే ఇవి జరిగేయి. అలా అని కింజరాపు కుటుంబం తప్పులు చేయలేదు అని కాదు. కానీ వాటి గురించి మాట్లాడే తీరు బాగుండకపోవడంతో దువ్వాడ శ్రీను తరుచూ ఏదో ఒక వివాదానికి కారణం అవుతున్నారు.
తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుకు మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేసి, తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరి, రాజకీయంగా మరో దుమారం రేపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి 175 కు 175 స్థానాలు వస్తే తాను టీడీపీ కార్యాలయానికి తాళాలు వేస్తానని అన్నారని, అసలు మీకు ఒక్కసీటు అయినా వస్తుందా అని ప్రశ్నించారాయన. తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకులు లేక, శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడికి సంబంధిత బాధ్యతలు అప్పగించారని అన్నారు. తమ పాలనలో అవినీతి లేదని పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యాలయానికి అచ్చెన్నే తాళాలు వేస్తారని, ప్రజలే ఆ పరిస్థితి తీసుకు వస్తారని అన్నారు.