ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికి ప్రమాదం వచ్చి పడింది. ఇన్నాళ్ళు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పదే పదే ఎన్నో చూసాం ఇలాంటివి ఒక లెక్కా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ దెబ్బకు చుక్కలు చూస్తున్నారు. పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన వారిలో నెలకొంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్నడు లేని విధంగా కష్టకాలం నడుస్తుంది. రాజధాని ప్రకటన జగన్ చేసిన తర్వాత తెలుగుదేశం నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది.
ప్రధానంగా ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి, తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారు. దీనితో చంద్రబాబు కూడా వాళ్లకు అడ్డు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జగన్ సర్కార్ కి వంత పాడటం, రాయలసీమలో సొంత జిల్ల్లా నేతలు, కర్నూలు జిల్లా నేతలు జై జగన్ అనడంతో పార్టీ ఇప్పుడు సందిగ్దంలో పడింది. పార్టీ మూడు ప్రాంతాలుగా విడిపోయింది. దీనితో చంద్రబాబు ఎటూ పాలుపోనీ స్థితిలో ఉన్నారు. అమరావతి వెళ్లి రైతులకు మద్దతు ఇవ్వడంతో రాజకీయంగా ఆ పార్టీ మరింత నష్టపోయినట్లు అయింది.
విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇది వ్యతిరేకతకు కారణంగా మారింది. దీనితో అక్కడి స్థానిక నేతలు కూడా చేసేది లేక జెండా వదిలిపెట్టే ఆలోచనలో ఉన్నారు. పది రోజుల్లో పార్టీలో చాలా మార్పులు వచ్చేసాయి. చంద్రబాబు మాట దాటని వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కీలక సమయంలో జగన్ కొట్టిన దెబ్బకు తెలుగుదేశం మరింత విలవిలలాడిపోతుంది. విశాఖలో జగన్ కు భారీగా ప్రజలు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నారు. దీనితో ఉత్తరాంధ్రలో పార్టీ దాదాపుగా చచ్చిపోయినట్టే.