ప్రముఖ పారిశ్రామిక వేత్త, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు త్వరలో వైసీపీలో చేరనున్నారని సమాచారం. టీడీపీని వీడి ఆయన జగన్ జమక్షంలో వైకాపాలో చేరుతారని తెలిసింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కీలక నేతలంతా పార్టీని విడిచిపెట్టి వెళ్తుండడంతో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఇప్పటికే అనేక మంది ముఖ్యమైన టీడీపీ నేతలు వైకాపాలో చేరారు. అయితే ఈ చేరికలకు ఇప్పుడప్పుడే బ్రేక్ పడేలా కనిపించడం లేదు. తాజాగా టీడీపీకి చెందిన మరొక ముఖ్య నేత వైకాపాలో చేరుతున్నట్లు తెలిసింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు త్వరలో వైసీపీలో చేరనున్నారని సమాచారం. టీడీపీని వీడి ఆయన జగన్ జమక్షంలో వైకాపాలో చేరుతారని తెలిసింది. ఈ మేరకు ఆయన జగన్‌ను కూడా ఇవాళో, రేపో కలిసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయన టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
గత కొంత కాలంగా టీడీపీలో రఘురామ కృష్ణం రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ కన్‌ఫాం అవుతుందని, అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ ఆ అవకాశాలు లేకపోవడంతో టీడీపీలో ఆయనకు అసంతృప్తి మొదలైంది. దీంతో వైకాపాలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే జగన్ టిక్కెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతోనే టీడీపీని రఘురామ కృష్ణం రాజు వీడుతారని తెలిసింది. అయితే గతంలో ఈయన తాను వైకాపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. కానీ అంతలోనే రివర్స్ గేర్ వేశారు. త్వరలో వైకాపాలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళో, రేపో జగన్‌ను కలిసి రఘురామ కృష్ణం రాజు వైకాపాలో చేరుతారని కూడా తెలిసింది.