టెక్కలి వైసీపీలో మళ్లీ ఆధిపత్య రగడ

-

టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ప్రయోగించిన సామాజిక మంత్రం బెడిసికొట్టింది . కట్ చేస్తే లోకల్ గా ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఏడాదికాలంగా పోటీ పడుతూనే ఉన్నారు. ఈక్రమంలో జిల్లా ముఖ్యనేతలు , పార్టీ అధిష్టానం తలో పదవి ఇచ్చి … అందరికీ సముచిత న్యాయం చేసి … ఇక అంతా ప్రశాంతం హమ్మయ్య అనుకునేలోపే మళ్లీ వారి మధ్య తెరవెనుక రాజకీయం మొదలైంది.టెక్కలి వైసీపీలో మళ్లీ పంచాయతీ మొదలవ్వడానికి కారణాల పై పార్టీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది.

 

సిక్కోలులో ఉత్తరాంధ్ర పెద్దన్న కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబానికి కంచుకోట టెక్కలి . అందుకే రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా … టెక్కలిలో మాత్రం కింజరాపు ఫ్యామిలీ పై చేయి సాధించింది . ఐతే అచ్చెన్నాయుడు మొదట్నుంచి వైసీపీకి కంట్లో నలుసులా మారడంతో మొన్నటి ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ అధినేత జగన్ తో సహా అందరూ టెక్కలి పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు . ఈక్రమంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి కేంద్రమాజీమంత్రి కిల్లి కృపారాణిని తీసుకొచ్చి జిల్లా పార్టీ అధ్యక్షురాలిని చేశారు . శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడను బరిలోకి దింపారు . టెక్కలిలో అచ్చెన్నాయుడి పై పేరాడ తిలక్ ను పోటీకి దించారు . ఇలా ఈ ముగ్గురు నాయకులను ఏకం చేసి అచ్చెన్న పైకి వదిలారు . టెక్కలిలో కాళింగసామాజికవర్గం బలం ఎక్కువ కాబట్టి కిల్లి , దువ్వాడ , పేరాడ కళింగత్రయం వర్కవుట్ అవుతుందని అంతా భావించారు.

కానీ గత ఎన్నికల్లో ఏం జరిగిందో 2019లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది . వీరిమధ్య ఉన్న అంతర్గత విభేదాలే అచ్చెన్న గెలుపుకు కారణమయ్యాయన్న టాక్ నేటికీ టెక్కలిలో నడుస్తోందట . ఇదిలా ఉంటే టెక్కలిలో ఓడినా రాష్ట్రమంతా సునామీ సృష్టించి ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది . దీంతో టెక్కలిలో పట్టుకోసం కిల్లి ,దువ్వాడ , పేరాడ మధ్య ఆధిపత్య పోరు మొదలైందట . పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు టెక్కలి వైసీపీ నేతలకు ఎక్కడికక్కడ అడ్డుతగులుతూనే ఉన్నాడు . ఈక్రమంలో అచ్చెన్నకు అడ్డుకట్ట వేయాల్సిన వైసీపీ నేతలు టెక్కలి తమదే అంటే తమదే అనేలా ఏడాదిగా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

టెక్కలి వైసీపీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టి … అందర్నీ ఏకం చేసి … అచ్చెన్న దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీ అధిష్టానంతో పాటు జిల్లాలో సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ తనవంతుగా తీవ్రంగానే ప్రయత్నం చేశారు . ఈ క్రమంలో టెక్కలి మనందరిదీ అని పార్టీనేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతలు దువ్వాడకు , ఇటీవల కాలంలో కళింగకార్పొరేషన్ ఛైర్మన్ పదవిని పేరాడ తిలక్ కు కట్టబెట్టి ఈకళింగ త్రయానికి సమన్యాయం చేశామని పార్టీ అధిష్టానం భావించింది . ఐతే నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత దువ్వాడ దూకుడు పెంచారు . అదే క్రమంలో మళ్లీ ఈ ముగ్గురు నేతల మధ్య తెరవెనుక రాజకీయం మొదలైంది.

దువ్వాడను సైడ్ చేసేసేందుకు కిల్లి కృపారాణి ,పేరాడ ఇప్పుడు లోకల్ పాలిట్రిక్స్ నడుపుతున్నారట. పేరాడ తిలక్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట . ఐతే ఈ సభకు ఊరందరినీ ఆహ్వానించి…. నియోజకవర్గ ఇంఛార్జి దువ్వాడకు చెప్పకుండా ఆయన్ని తమ లెక్కల్లోంచి పక్కన పెట్టేశారు . ఈవిషయం తెలుసుకున్న దువ్వాడ నేరుగా ఈ పంచాయతీ సీఎం జగన్ దగ్గర పెట్టేశారట . అట్నుంచి ఈ పంచాయతీలో జగన్ నుంచి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి దగ్గరకు చేరిందట . దీంతో అధినేత ఆదేశాల మేరకు కృపారాణి , తిలక్ తో పాటు కృష్ణదాస్ ను కూడా పిలిచి విజయసాయిరెడ్డి అందరికీ క్లాస్ తీసుకున్నారట.

టెక్కలిలో ఎంతో గ్రాండ్ గా సభ ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారం పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుండటంతో పార్టీ శ్రేణులు ఎంతో సంబరపడ్డారట . కానీ దువ్వాడను పిలవకపోవడం… ఆ కారణంగానే సభ ఆగిపోవడం… టెక్కలి ఇంటర్నల్ పాలిట్రిక్స్ పై పార్టీ ముఖ్యనేతలు అసహనం వ్యక్తం చేయడంతో కార్యకర్తలు తీవ్రనిరాశకు గురయ్యారట. ఇదిలా ఉంటే నిన్నమొన్నటి వరకూ అంతర్గతంగా ఉన్న విబేధాలు… తాజా వ్యవహారంలో బహిర్గతం అయ్యాయని అందరూ చెవులు కొరుక్కుంటున్నారట .

Read more RELATED
Recommended to you

Latest news