తగ్గేదేలే అంటున్న బీజేపీ… కేసీఆర్‌ని రౌండప్ చేసేశారుగా!

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ నేతలు దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్…మరింత దూకుడుగా కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచాక మరింతగా కేసీఆర్‌పై ఎటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇంతవరకు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ఫ్రస్టేషన్ పెంచేసుకుని, తాజాగా బీజేపీపై ఫైర్ అయ్యారు.

cm kcr bjp party

రైతులని మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు…భావోద్వేగాలని రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటుందని, త్వరలోనే ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు దిగుతామని, ఢిల్లీలో అగ్గి పెడతామని కేసీఆర్ మాట్లాడారు. అలాగే తనని జైల్లో పెట్టిస్తానని బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ‘దమ్ముంటే టచ్ చేసి చూడండి..కేసీఆర్‌ని అరెస్ట్ చేసే సత్తా ఉందా’ అంటూ కేసీఆర్ ఫైర్ అయిపోయారు. ఇంతకాలం స్పందించని కేసీఆర్…హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత బాగా ఫైర్ అయ్యారు.

అంటే బీజేపీ వల్ల ఇబ్బంది ఉందని కేసీఆర్‌కు అర్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ఫైర్ అయ్యారని బీజేపీ నేతలు ఏమి తగ్గలేదు…తగ్గేదేలే అంటూ..బండి సంజయ్, అరవింద్‌లు తమదైన శైలిలో కేసీఆర్‌కు కౌంటర్లు ఇచ్చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే చెబుతున్నారని, తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పే అని అన్నారు. . రైతులను ఆగం చేసింది కేసీఆర్ కాదా? అని బండి ప్రశ్నించారు. కేంద్రం పెత్తనం ఏంటని అనేది కేసీఆరే.. మళ్లీ కేంద్రం ధాన్యం కొనడం లేదని అనేది కేసీఆరే అని, కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇక కేసీఆర్‌ని బరాబర్ జైలుకు పంపిస్తామని, ఎప్పటికైనా ఖచ్చితంగా జైలుకు వెళ్తారని అరవింద్ మాట్లాడారు. కేసీఆర్ చేసిన అవినీతే ఆయన్ను జైలుకు పంపిస్తుందని, అవీనితిపై ఆధారాలను ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని అన్నారు. అంటే కేసీఆర్ ఒకటి అంటే…మేము వంద అంటాం అన్నట్లుగా బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు.