దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడేలా లేదు..ఓ వైపు బీజేపీ దూకుడుగా ముందుకెళుతుంది..ఇప్పటికే మోదీ-అమిత్ షా ద్వయం దెబ్బకు దేశంలో కాంగ్రెస్ కుదేలైపోయింది. ఇక కాంగ్రెస్ లో జరిగే అంతర్గత కలహాలు కూడా కొంపముంచుతున్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పరిస్తితి ఎప్పటికప్పుడు దిగజారుతూ వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ రెండుసార్లు కేంద్రంలో చావుదెబ్బతింది. అయినా సరే కాంగ్రెస్ లో మార్పు రాలేదు. ఇంకా రచ్చ లేపుతూనే ఉన్నారు. దీని వల్ల మూడోసారి కూడా కాంగ్రెస్ నష్టపోయేలా ఉంది.
ఇటు అధికారంలో ఉన్న రాష్ట్రాలని సైతం కాంగ్రెస్ కోల్పోతూ వస్తుంది..బీజేపీ వ్యూహాలు..కాంగ్రెస్ సొంత తప్పిదాలతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బలం ఉన్నా సరే..వాటిని కోల్పోయింది. ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. ఆ రాష్ట్రంపై బీజేపీ ఎప్పటినుంచో కన్నేసి ఉంది. తమకు అనుకూల పరిస్తితులు కోసం ఎదురుచూస్తుంది. ఇక అక్కడ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఆ పోరు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సమయంలో మరింత ఎక్కువైంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠంలో కూర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో కాంగ్రెస్ పదవికి ఎన్నికలు జరపాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ తరుపున సీనియర్ అయిన అశోక్‌ని అధ్యక్ష రేసులో పెట్టాలని అనుకున్నారు. అలాగే శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు పోటీ చేయాలని అనుకున్నారు. అయితే పోటీకి సోనియా గాంధీ ఓకే చెప్పారు. కాకపోతే పార్టీ తరుపున అధికారిక అభ్యర్ధిగా అశోక్‌నే పెట్టారు.
అయితే అధ్యక్ష పీఠంలోకి వస్తే రాజస్థాన్ సీఎం పదవి నుంచి అశోక్ తప్పుకోవాలి. దీంతో సచిన్‌ని సీఎం పీఠంలో కూర్చోబెడతారని తెలిసింది. దీనికి అశోక్ ఒప్పుకోవడం లేదు. తన వర్గం నుంచే సీఎం ఉండాలని అంటున్నారు. ఇదే క్రమంలో అశోక్‌కు చెందిన 83 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తమలోని ఒకరిని సీఎంగా పెట్టాలని, సచిన్ పెడితే ఒప్పుకోమని చెప్పేస్తున్నారు. పైగా కొందరు స్పీకర్‌కు రాజీనామాలు అందించారు.
అధిష్టానం పెద్దలు ఈ సమస్యని పరిష్కరించాలని అనుకున్న సాధ్యం కావడం లేదు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో కల్లోలం కొనసాగుతుంది. వాస్తవానికి రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎక్కువ కష్టపడింది సచిన్. అప్పుడే ఆయన్ని సీఎం చేయాలని రాహుల్ చూశారు..కానీ సోనియా మాత్రం అనుభవం ఉందని అశోక్‌కు పగ్గాలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ రివర్స్ అయ్యారు.
ఇక 200 స్థానాల రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్‌ఎల్‌డీ సభ్యుడొకరు, 13 మంది స్వతంత్రులు మద్దతిస్తున్నారు. అంటే 122 మంది మద్దతు ఉంది. బీజేపీకి 71, ఆర్‌ఎల్‌పీ-3, సీపీఎం-2, బీటీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 122 మందిలో పైలట్ వర్గీయులు 18 మాత్రమే. 104 మంది తమ శిబిరంలోనే ఉన్నారని అశోక్ వర్గం చెబుతోంది. దీంతో రచ్చ కొనసాగుతుంది. ఇక ఇదే అదునుగా భావించి..బీజేపీ చక్రం తిప్పితే రాజస్థాన్‌ని కూడా కాంగ్రెస్ కోల్పోతుంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.