హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఊహించని సపోర్ట్ వస్తుంది. మామూలుగానే హుజూరాబాద్‌లో ఈటలకు పార్టీలకు అతీతంగా మద్ధతు ఎక్కువగా ఉంది. అందుకే ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఇక్కడ బీజేపీకి పెద్ద సీన్ లేకపోయినా, టీఆర్ఎస్కు పోటీగా నిలబడటానికి కారణం ఈటల ఇమేజ్ అనే చెప్పొచ్చు.
ఎందుకంటే వరుసగా ఎన్నికల్లో ఇక్కడ ఈటల వర్సెస్ కాంగ్రెస్ గానే పోరు జరుగుతూ వస్తుంది. టీఆర్ఎస్ నుంచి ఈటల పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. అలాగే కాంగ్రెస్ ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ బీజేపీకి పెద్దగా ఓట్లు పడవు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. అయితే ఇప్పుడుప్పుడే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి ఈటల వచ్చారు. బీజేపీలోకి వచ్చినా సరే తన సొంత బలం నమ్ముకునే ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు.
అయితే ఈటలకు న్యూట్రల్ వర్గాల నుంచి కూడా మద్ధతు ఎక్కువగా వస్తుంది. ఊహించని విధంగా పలువురు పెద్దలు, మేధావులు ఈటలకు బహిరంగంగానే మద్ధతు ఇచ్చారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోనె ప్రకాశ్ రావు లాంటి నేతలు ఈటల గెలవాలని కోరుకుంటున్నారు. అటు కాంగ్రెస్ సైతం ఈటల విషయంలో కాస్త మెతకగానే ఉన్నట్లు కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా దూకుడుగా హుజూరాబాద్‌లో రాజకీయం చేయడం లేదు.
ఒకవేళ కాంగ్రెస్ దూకుడుగా ఉంటే ఓట్లలో చీలిక ఎక్కువ వచ్చి ఈటలకే నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ని ఓడించడానికి అన్నీ వర్గాలు ఈటలకు సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.