తెలంగాణ ముఖ్యమంత్రి తో సీఎల్పీ నేతలు భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ బై పోల్ కు టైం సమీపిస్తున్న వేళ… సీఎంతో కాంగ్రెస్ నేతల భేటీ పార్టీకి చేటు చేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ భేటీని కాంగ్రెస్ హై కమాండ్ కూడా సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పెద్దలు కోపంగా ఉన్నారట. దీనిపై వివరణ ఇవ్వాలని కూడా భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని సమాచారం.
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలు, ఆయన నిర్ణయాలు ఎల్లప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటాయనేది రాజకీయ నాయకులందరూ చెప్పే మాట. ఆయన ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో, ఏ పనిని చేస్తారో… ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించన తర్వాత ఇన్నేళ్లలో ఏ ఒక్కసారి కూడా కాంగ్రెస్ నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు.
కానీ కొత్తగా అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి తొలిసారి కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సీఎంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్ లోనే చిత్రవధలకు గురై మృతి చెందిన మరియమ్మ అంశం గురించి చర్చించారు.
అంతేకాకుండా హుజూరాబాద్ ఎన్నిక సమీపిస్తున్న వేళ… కాంగ్రెస్ నేతలు సీఎంను కలిస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను కలవడంతో బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చినట్లు అయింది. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ను కడిగి పారేస్తున్నారు.