ఓవైపు వైసీపీ ప్రభుత్వం విశాఖ శివార్లలోని భీమిలీ చుట్టుపక్కల పరిపాలక రాజధాని కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఇటువైపు అమరావతిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఏడో రోజు మహా ధర్నాతో ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఇదిలా ఉంటే.. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా ఏపీ సీఎం జగన్ కు మద్దతునిచ్చే మాటలే మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని అన్నారు.
వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని, మేధాశక్తితో భావి ఇంజనీర్లు దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరముందని, వనరులను సద్వినియోగం చేసుకోవడమే మన పనని వెంకయ్య నాయుడు చెప్పారు. కల్తీలేని విద్యుత్ అందించేలా పరిశోధనలు చేయాలని, పరిశ్రమలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండేలా మనిషి జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి ఏపీ సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల నిర్ణయానికి వెంకయ్య మద్దతునిచ్చేనట్టే కనిపిస్తోంది.దీన్ని బట్టి జగన్ నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందనే అర్థమవుతోంది.