భాజపా రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి

-

తెలంగాణ భాజపాలోనూ అసంతృప్తి రాగం మొదలైంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను మౌనంగా ఉంచిందని అవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకివ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలన్నారు.

తాను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోవాలని విజయశాంతి అన్నారు. తన సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్​కే తెలియాలని వ్యాఖ్యానించారు. తానెక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలమని ప్రశ్నించారు.

“నా పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది.” – విజయశాంతి, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు

Read more RELATED
Recommended to you

Latest news