ఆ ఎమ్మెల్యే బలపడుతున్నారా? జాగ్రత్తపడుతున్నారా?

గెలిచిన పార్టీని కాదనుకున్నారు అధికారపార్టీతో అంట కాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా కేడర్, లీడర్లకు గేట్లు ఎత్తేసి కొత్త కండువాలు కప్పేస్తున్నారు . ఇదంతా ఏంటని ప్రశ్నిస్తే.. ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడమే నా టాస్క్ అన్న రేంజ్ లో చెబుతున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత వైసీపీకి అనుభందంగా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి వ్యూహాలు, కామెంట్స్‌పై ఇప్పుడు విశాఖలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

విశాఖ దక్షిణ నియోజకవర్గం అధికార వైసీపీ ప్రయోగాలకు వేదికగా మారింది. ఇక్కడ రాజకీయాలను స్థానికత, సామాజిక సమీకరణాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ ఫిరాయించారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. రెబల్ ఎమ్మెల్యేగా మారి పాత పార్టీ పైనే కత్తి గట్టారు. ఇటీవల వాసుపల్లి వ్యూహాలు, వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వైసీపీకి జై కొట్టిన సమయంలో టీడీపీ కేడర్‌ తనతో రాదని.. వైసీపీలో ఉన్న నాయకులు సరిపోతారని ప్రకటించారు వాసుపల్లి. తాను అధికారపార్టీకి విధేయుడినని నిరూపించుకునేందుకు టీడీపీ, చంద్రబాబులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

ఇక మూడు రాజధానులపై టీడీపీ వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ఊరేగింపు సైతం చర్చకు దారితీసింది. టీడీపీతో తెగ తెంపులు అవ్వకుండానే వాసుపల్లి దూకుడు ఎక్కువ కావడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ సిటీ పరిధిలో వైసీపీకి బలమైన ఎమ్మెల్యే అనే ముద్ర వేసుకోవడానికి వాసుపల్లి తాపత్రయ పడుతున్నారట. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యమే ఇస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా దక్షిణ నియోజకవర్గంలో టీడీపీని బలహీన పరిచే దిశగా వలసలకు గేట్లు ఎత్తారు ఎమ్మెల్యే. రోజు వందల మందిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కార్పొరేటర్ అభ్యర్థి వరకు అందరికీ వైసీపీ కండువాలు కప్పి హడావిడి చేస్తున్నారు.

ఈ లెక్కేంటి అంటే.. స్థానికంగా టీడీపీని ఖాళీ చేయడమే తన లక్ష్యమని ప్రకటిస్తున్నారట. ఎమ్మెల్యే ప్రకటనలో కొత్తదనం లేకపోయినా దానివెనక ఆలోచన బలంగానే ఉందట. నియోజకవర్గంలో తన బలం పెంచుకోవడం ద్వారా అంతర్గత రాజకీయ ఎత్తుగడలను తట్టుకుని నిలబడటానికి దృష్టిపెట్టారట. వైసీపీలో మొదటి నుంచి కోలా గురువులు నాయకత్వం నడుస్తోంది. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి వాసుపల్లి పై ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కోఆర్డినేటర్లుగా వచ్చిన వారు నిలదొక్కుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు అవకాశం కల్పించినా వాసుపల్లినే గెలిచారు. ప్రస్తుతం వాసుపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకోగా కోలా గురువులు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు.

ద్రోణంరాజు శ్రీనివాసరావు రాజకీయ వారసుడిగా తన కుమారుడు శ్రీవాస్తవ అదృష్టాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. దీంతో దక్షిణ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చాపకింద నీరులా ఉన్నాయి. అంతా కలిసికట్టుగానే కనిపిస్తున్నా ఎవరి గ్రూప్ వారిదే. గ్రేటర్ ఎన్నికల నాటికి ఎవరి ఆధిపత్యం వారు నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే వైసీపీలో పట్టు సాధించడం.. తన బలం పెంచుకోవడం ఎమ్మెల్యే వాసుపల్లికి అత్యవసరంగా మారింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారనేది వినికిడి. మరి.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వాసుపల్లి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో…