రాజకీయాలు కావచ్చు.. భైంసా అల్లర్లు కావచ్చు.. అసెంబ్లీ సమావేశాలు.. కరోనా.. సూర్యాపేట కబడ్డీ పోటీలు కావచ్చు… ఏది జరిగినా సరే ప్రజలంతా ఉత్కంఠభరితంగా మునివేళ్లపై నిలుచునే పరిస్థితి ఉంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఎన్నికలకంటే ఉప ఎన్నికలే రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకవుతున్నాయి. పరువు కోసం ఆరాటపడుతున్నాయి. తమ బలాన్ని చాటుకోవడానికి తహతహలాడుతున్నాయి. తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించాయంటే అతిశయోక్తి కాదు. సాధారణ ఎన్నికలకన్నా ఉప ఎన్నికల కోసం, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి.
మాటలతోనే చెమటలు.. చేతల్లో కాదు
కేవలం మాటలతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే విద్యలో ఆరితేరిన భారతీయ జనతాపార్టీ మాత్రం నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు వచ్చేసరికి గుంభనంగా ఉంటోంది. మాటలు రానట్లు వ్యవహరిస్తోంది. సైలెంట్‌గా ఉండటంవల్ల తమ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ ఎటువంటి సంకేతాలు పంపిస్తోందంటే… ఓటమిని ముందే ఒప్పుకున్నట్లుగా!!. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాలతో కారు నాగార్జునసాగర్‌వైపు శరవేగంతో దూసుకువెళుతోంది. అభ్యర్థి ఎవరైనా కావచ్చు.. అక్కడ గెలవడమే తరువాయి.. ప్రత్యర్థులముందు బలాన్ని చాటడమొక్కటే మిగిలింది అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు వ్యవహరిస్తున్నాయి.
గెలవాలంటే ఏంచేయాలి?
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను బీజేపీ ఎందుకు పట్టించుకోవడంలేదంటే అభ్యర్థి దొరక్క కావచ్చు. అధికార పార్టీ ఇంతవరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి ఖాయమయ్యారు. దుబ్బాక నుంచి దూకుడుగా వ్యవహరించిన బీజేపీ సాగర్ దగ్గరకు వచ్చేసరికి నెమ్మదించింది. ఆ ఊపు తగ్గిపోయింది. అధికార పార్టీ అభ్యర్థి ఎలాగూ బలమైన అభ్యర్థే అవుతారు. జానారెడ్డి కూడా మరో బలమైన అభ్యర్థి. ఇద్దరు ఉద్ధండుల మధ్య పోటీని తట్టుకొని నిలబడేదెవరా అని బీజేపీ అన్వేషణ కొనసాగిస్తోంది. గెలుపు సంగతి తర్వాత కనీసం ఓట్లు చీల్చి రెండోస్థానమైన దక్కించుకోవాలి.. లేదంటే బీజేపీ పనైపోయిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారేమోనన్న భయం కూడా వెన్నాడుతోంది. జానారెడ్డి ఇక్కడినుంచి ఏడుసార్లు విజయం సాధించారు. ఈసారి గెలవాలంటే చెమటోడ్చక తప్పదు. ఈ పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలా? అనే యోచనలో బీజేపీ ఉంది. మరి ఆ పార్టీకి అభ్యర్థి దొరుకుతాడేమో చూద్దాం!!.