మారుమూల ప్రాంతం నుంచి ఎదిగి వచ్చిన లీడర్ ధర్మాన ప్రసాదరావు. నిన్నటి వేళ అసెంబ్లీ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిన్నటి వేళ ఆయన మాట్లాడిన తీరు సీనియర్ శాసన సభ్యులకు కూడా ఓ రిఫరెన్స్ కోడ్..! వైసీపీ సభ్యులే కాదు విపక్ష సభ్యులు కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ! అనేందుకు తార్కాణమే నిన్నటి ప్రసంగం. న్యాయ, శాసన వ్యవస్థలకు ఉన్న అధికారాల గురించి,విశేషించి దక్కించుకున్న అధికారాల గురించి, హక్కులు మరియు బాధ్యతల గురించి ఆయన వివరించిన వైనం..ఆ తీరు నభూతో ! ఆ స్థాయిలో టీడీపీ లీడర్లు కూడా మాట్లాడడం ఇప్పట్లో సాధ్యం కాదు అన్నది నిర్వివాదం. చాలా రోజులకు అసెంబ్లీలో సబ్జెక్టివ్ డిబెట్ కు ఆస్కారం ఇచ్చేలా ధర్మాన మాట్లాడారు. కొనసాగింపుగా సీఎం కూడా మాట్లాడి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రాజధాని రైతులను, పోరాట వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం ఒకటి చేశారు.
సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. సీనియర్ మోస్ట్ లీడర్. వర్తమాన పరిణామాలకు సంబంధించి అదే పనిగా మాట్లాడినా, మాట్లాడకపోయినా తన హుందాతనానికి మాత్రం అస్సలు ఏమాత్రం ఇబ్బంది రానివ్వకుండానే ప్రవర్తిస్తారు.
అన్నింటిపైనా అవగాహన ఉంది. అదే సందర్భంలో కొన్నింటిపై ఆయనకు పట్టు ఉంది. ఇంగ్లీషు అర్థం చేసుకోగలరు. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు వివరించడంలో ముందుంటారు. వారికి అర్థం అయ్యే భాషలో చెప్పగలరు. ఆ విషయమై అత్యంత సమర్థులు కూడా ! ఆ విధంగా ఇవాళ జగన్ గూటిలో ఉన్న ఏకైక మాస్ లీడర్ ధర్మాన ప్రసాదరావు.
ప్రయివేటీకరణ విధానాలు, ప్రభుత్వ సంబంధ నిర్ణయాలు వీటిపై కూడా మంచి స్థాయిలో తన వాదం వినిపించగలరు. ఎవ్వరు ఏం చెప్పినా వింటారు. రాస్తే క్షుణ్ణంగా చదివి స్పందిస్తారు. స్పందించాల్సినంత స్పందిస్తారే తప్ప ఇతరులపై సాధారణంగా కోపం అయితే రుద్దరు. ఎక్కువగా జనం మధ్య ఉండేందుకు ఇష్ట పడతారు. అదేవిధంగా తన దగ్గర అదే పనిగా ఇతరుల గురించి ఫిర్యాదుల రూపంలో మాట్లాడితే ఒప్పుకోరు. అవన్నీ ఎందుకు మీరు బాగా పని చేయండి. అధినాయకత్వం మిమ్మల్ని ఏదో ఒక రోజు పిలిచి గుర్తించి, అందుకు తగ్గ రీతిలో గౌరవిస్తుంది అని మాత్రమే చెబుతారు. నిన్నటి వేళ ఆయనకు ఉన్న లెజిస్లేటివ్ స్టేచర్..ను ఉపయోగించుకున్నారు.
లెజిస్లేటివ్ స్టేచర్ అంటే ఏం లేదు ఎన్నో ఏళ్లుగా శాసన సభ్యునిగా ఉంటూ అక్కడి విధివిధానాలపై పట్టు ఉండడం. సభకు ఉన్న హక్కులు, బాధ్యతలతో పాటు పరిధి గురించి, విస్తృతి గురించి ఎంతో తెలిసిన వ్యక్తి గా ఆయనకు పేరుండడం. అదే ఇప్పటి లెజిస్లేటివ్ స్టేచర్ అనే పదానికి ఓ గుర్తింపు..లేదా ఓ విస్తృతార్థం కూడా !
రాజశేఖర్ రెడ్డి హయాంలో రెవెన్యూ శాఖకు సంబంధించి అమాత్య హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన సందర్భంలో ధర్మాన మాటకు తిరుగుండేది కాదు. ఆ విధంగా ఆయన ఎన్నో మంచి పనులకు సాయం అందించారు. అదేవిధంగా చట్ట సభల్లో సభ్యులు నడుచుకోవాల్సిన తీరుపై కూడా ఓ స్పష్టత ఉంది. అందుకే కొత్తగా వచ్చే శాసన సభ్యులు నేర్చుకోవాల్సి ఉంది ఎంతో అని ! పదే పదే అంటుంటారు. చట్టాలు చేసే హక్కు శాసన సభకు ఉందని, అందుకు దారి తీసిన పరిణామాలు..వాటి వెనుక ఉన్న నేపథ్యాలు..అన్నింటినీ వివరించగలిగారంటే అందుకు కారణం ఆయనకు ఉన్న అపార అనుభవమే! అసలు ఆయన స్టేట్మెంట్ లో వివాదాల ప్రస్తావనే ఉంది కానీ ఎక్కడా వివాదం ఇచ్చే మాటలు లేవు. అదీ ఆ ప్రసంగంలో ఉన్న ప్రత్యేకత.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి…