షర్మిల స్కెచ్ ఏంటి? ఎవరినీ వదలట్లేదుగా..!

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో నిలదొక్కుకోవడానికి ప్రత్యర్ధులని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. అలా తిడితే…ప్రత్యర్ధి నేతలకు కూడా తనని తిడతారు..అప్పుడు రాజకీయంగా ముందుకు రావచ్చనే ప్లాన్‌లో షర్మిల ఉన్నట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ అదే స్ట్రాటజీతో సక్సెస్ అవుతుంది..కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విరుచుకుపడటం..అటు కేసీఆర్‌తో సహ టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలని తిట్టడంతో రేసులో ఉండాల్సిన కాంగ్రెస్ వెనక్కి వెళ్ళి, బీజేపీ ముందుకొచ్చింది.

ఇప్పుడు అదే ఫార్ములా షర్మిల వాడుతున్నట్లు ఉన్నారు..ఆమె పార్టీ పెట్టారు గాని పెద్దగా హైలైట్ కాలేదు. రాజకీయమంతా టీఆర్ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతుంది. రాష్ట్రంలో షర్మిల పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పాదయాత్ర చేస్తూ..ఏ నియోజకవర్గంలోకి వెళితే..అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అక్కడ ఉన్న సమస్యలపై మాట్లాడితే బాగానే ఉంటుంది గాని..షర్మిల ఏకంగా వారిపై విరుచుకుపడుతున్నారు. ఓ రేంజ్‌లో తిడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే..బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ అని వ్యక్తిగతంగా దెబ్బకొట్టేలా మాట్లాడారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌ని టార్గెట్ చేశారు..రౌడీ గంగుల అని, గంగుల కాస్త రంగుల కమలాకర్‌గా మారిపోయారని అన్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సైతం షర్మిల వదలలేదు.

విభజన హామీలపై ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేని దద్దమ్మ బండి సంజయ్‌ అని, మతం పేరుతో చిచ్చుపెట్టి, ఆ మంటలో చలి కాచుకోవాలని, ఇదే ఆయనకు తెలిసిన సిద్ధాంతమని ఫైర్ అయ్యారు. బండి సంజయ్కి దమ్ముంటే, కమీషన్లు తీసుకోకుంటే కేంద్రంతో మాట్లాడి కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని తిడుతూ ముందుకెళుతున్నారు..కాకపోతే రివర్స్‌లో షర్మిలని పెద్దగా టార్గెట్ చేయడం లేదు..ఏదో ఒకరిద్దరే షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. దీని వల్ల షర్మిల పార్టీ హైలైట్ అవ్వడం లేదు. మొత్తానికి తిట్టడం,తిట్టించుకోవడమే షర్మిల స్కెచ్‌లా ఉంది.