టీడీపీ గెలుపును అడ్డుకుంటున్నది ఎవరు…?

-

ఏపీలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకోసం దాదాపు మూడేళ్లుగా రాష్ట్రమంతా తెగ తిరిగేస్తున్నారు. అదే సమయంలో… గతానికి భిన్నంగా అభ్యర్థులను కూడా ముందే ప్రకటించారు. ఇదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే భయంతో… ముందుగానే ప్రతిపక్షాలంతా ఏకమవ్వాలంటూ పిలుపునిచ్చారు కూడా. జనసేన, బీజేపీతో పొత్తు కూడా కుదుర్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా… 21 స్థానాల్లో జనసేన, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రంగంలోకి దిగుతోంది.

సీట్ల పంపకం పూర్తి అయ్యే సరికి టీడీపీలో అసంతృప్తులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఐదేళ్లుగా టీడీపీ కోసం పని చేసిన నేతలు… చివర్లో టికెట్ లేదని తేలడంతో.. ఏం చేయాలో అర్థం కాక… పార్టీ అధినేతపై విమర్శలు చేస్తున్నారు. అటు శ్రీకాకుళం మొదలు.. ఇటు తిరుపతి వరకు ప్రతి చోట ఇదే పరిస్థితి. సీనియర్ నేతలను కాదని… కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటూ టీడీపీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పార్టీ గెలిచినట్లే అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎలాగైనా గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు… ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేల మీద సర్వేలు చేయించారు. గెలిచే అభ్యర్థులనే నియోజకవర్గం ఇంఛార్జులుగా ప్రకటించారు కూడా. ఇదే సమయంలో పొత్తు కుదరటంతో… ఆయా నియోజకవర్గాల్లో నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. అయితే టీడీపీ నేతలకు సర్దిచెబుతున్నారు కానీ… బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. పది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

వీటిల్లో కేవలం రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పాత అభ్యర్థులున్నారు. మిగిలిన చోట అంతా కొత్త వారే. వారిలో గెలిచేది ఎవరు అంటే… ఎవరూ లేరు అనే మాట వినబడుతోంది. కొద్దొ గొప్పొ అవకాశం ఉంటే… విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటున్నాయి సర్వే రిపోర్టులు. మిగిలిన చోట వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం దాదాపు ఖాయమంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం సామాజిక సమీకరణలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం టీడీపీని ఓడించటానికే బీజేపీ ఈ తరహా గేమ్ ప్లాన్ ఆడుతోందనే మాట బలంగా వినిపోస్తోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీజేపీ పరోక్షంగా కారణమంటున్నారు రాజకీయ విమర్శకులు.

Read more RELATED
Recommended to you

Latest news