టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌ టెన్ష‌న్‌… మంత్రి వ‌ర్గంలోంచి ఆ ముగ్గురు ఔట్‌?

-

తెలంగాణ‌లో తిరుగులేని దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ జోరుకు దుబ్బాక ఓట‌మి పెద్ద బ్రేక్ వేసింది. దీంతో రేపో మాపో జ‌రిగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌పై ఆ పార్టీ నేత‌ల్లో పెద్ద టెన్ష‌న్ నెల‌కొంది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నారా ?  ప్ర‌జ‌ల్లో ప‌ట్టులేని నాయ‌కులు, మంత్రులుగా చ‌క్రం తిప్ప‌లేక చ‌తికిల ప‌డుతున్న అమాత్యుల‌కు ఆయ‌న చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్‌ వ‌ర్గాలు స‌హా పార్టీ కీల‌క నేత‌ల నుంచి కేసీఆర్ స‌మాచారం సేక‌రించార‌ని… దాదాపు ముగ్గురు మంత్రుల‌ను త‌న కేబినెట్‌నుంచి త‌ప్పించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నార‌ని.. తాజాగా స‌మాచారం. దీంతో మంత్రి వ‌ర్గంలో పెద్ద గుబులు బ‌య‌ల్దేరింది.

 

రెండోసారి కూడా అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. ఆచితూచి అడుగులు వేశారు. తొలుత తాను సీఎంగా.. హోంమంత్రిగా మ‌హ‌మూద్ అలీ మాత్ర‌మే ప్ర‌మాణం చేశారు. చాన్నాళ్ల‌కు కానీ.. మంత్రుల‌ను కేటాయించ‌లేదు. అయితే.. 2018 డిసెంబ‌రులో ఏర్పాటు చేసుకున్న కేబినెట్‌పై కేసీఆర్ పోస్ట్ మార్ట‌మ్ చేప‌ట్టారు. మ‌రీ ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న మంత్రుల‌పై ఆయ‌న కూలంక‌షంగా దృష్టి పెట్టారు. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు దూకుడుగా ఉన్నారు ? ఎవ‌రు ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతున్నారు ? అనే అంశాల‌పై దృష్టి పెట్టారు.

ఇక‌, ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఒక మంత్రి రాస‌లీల్లో గ‌డుపుతున్నార‌ని, మ‌రికొంద‌రు.. సొంత ప‌నుల్లో ఉన్నారు. ఇంకొంద‌రు సొంత ఇమేజ్ పెంచుకునేందుకు స‌మ‌యం వెచ్చిస్తున్నార‌న్న నివేదిక‌లు కేసీఆర్‌కు వెళ్లాయి. ఒక‌రిద్ద‌రు ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేదు. దీంతో ఇలాంటి వారిని ప‌క్క‌న పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన ఒక‌రు, ద‌క్షిణ తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిపై వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి.

అదే స‌మ‌యంలో హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని కూడా మారుస్తార‌నేది ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న టాక్‌. ఇటీవ‌ల ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.. ఇప్పుడు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తుండ‌డంతో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news