తెలంగాణలో మరో ఉపఎన్నిక వస్తుందా? తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న..తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు. అలాగే 2009లో ఓడిపోగా మళ్ళీ 2014లో గెలిచారు. ఇక తర్వాత టిడిపిని వదిలి బిఆర్‌ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మరొకసారి గెలిచారు.
ఇక ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నికపై చర్చలు సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు మరో 8 నెలల సమయం ఉన్న తరుణంలో కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధి మరణించిన ఆరు నెలల లోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉంటే కేంద్రంతో చర్చించిన తర్వాత ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఆశలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరపాలంటే ఆరు నెలల లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే ఉపఎన్నిక నిర్వహించిన గెలుపొందిన వ్యక్తి కనీసం రెండు నెలలు కూడా పదవిలో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి కంటోన్మెంట్ ఉప ఎన్నిక లేనట్లేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
అదే సమయంలో సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ పరిధిలో బిఆర్‌ఎస్ తరుపున ఎవరు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సాయన్న వారసురాలుగా ఉన్న లాస్య నందిత పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు సాయన్న మృతితో లాస్య పోటీ ఖాయమని బిఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. గతంలో కవాడిగూడ కార్పొరేటర్ గా పని చేసిన లాస్య.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.
అటు యువ నేత కృశాంక్ సైతం కంటోన్మెంట్లో ఉన్నారు. మరి బిఆర్‌ఎస్ పార్టీ సాయన్న కుమార్తెని కాదని వేరే వాళ్ళకు సీటు ఇస్తుందో లేదో చూడాలి.