బాబు గారి భయం ఏంటో? కుప్పంలో ఏం మార్చాలి?

కుప్పం అంటే టి‌డి‌పి అధినేత చంద్రబాబు….సొంత అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడు పర్యాయలుగా కుప్పంలో చంద్రబాబు సత్తా చాటుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే కుప్పంలో బాబు గెలుపుకు బ్రేకులు పడలేదు. ఎక్కడైనా రాజకీయంగా సేఫ్‌గా ఉండటం కోసం నాయకులు…తమ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు గానీ…తమకు పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు.

chandrababu naidu

కానీ చంద్రబాబు…అలాంటి స్ట్రాటజీలు ఏం ఉపయోగించుకుండా…అసలు తమ వర్గమైన కమ్మ ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉండే కుప్పంలో పోటీ చేస్తూ సత్తా చాటుతున్నారు. అసలు ఇంతవరకు బాబుకు ఓటమి భయం లేదనే చెప్పాలి….కానీ తొలిసారి 2019 ఎన్నికల తర్వాత బాబుకు ఓటమి భయం కలిగినట్లే కనిపిస్తోంది. జగన్ గాలిలో గత ఎన్నికల్లో కుప్పంలో బాబుకు మెజారిటీ తగ్గింది.

ఇక ఆ తర్వాత నుంచి కుప్పం టార్గెట్‌గా వైసీపీ రాజకీయం చేస్తూనే ఉంది. సి‌ఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు…కుప్పంలో బాబుని దెబ్బతీయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీని గెలిపించారు. అసలు ఇక్కడ టి‌డి‌పికి పెద్ద ఛాన్స్ లేకుండా చేశారు. ఇక ఇక్కడ నుంచే కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని ప్రచారం మొదలైంది. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో బాబు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా చెబుతున్నారు.

అంటే కుప్పంలో బాబు ఓడిపోతారని వైసీపీ ఎంత కాన్ఫిడెన్స్‌తో ఉందో అర్ధమవుతుంది. అలాగే బాబుకు కాస్త ఓటమి భయం కూడా వచ్చింది. అందుకే కుప్పంలో పార్టీని సెట్ చేయాలని బాబు ఫిక్స్ అయ్యారు…అందుకే సడన్‌గా కుప్పం పర్యటన పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో బాబు పర్యటించనున్నారు. పార్టీ కోసం కష్టపడని వారిని సైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ కుప్పంలో గెలవడమే లక్ష్యంగా బాబు పావులు కదపనున్నారని తెలుస్తోంది.