గెలుపు కోసం ఈటల రాజేందర్ కొత్త ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడమే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etela Rajender ) ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో, హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలబడిన ఈటల, హుజూరాబాద్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈటల రాజేందర్

ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టేశారు. ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా ఈటల మాత్రం, ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు దగ్గరవ్వడమే లక్ష్యంగా ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో గెలవడానికి సరికొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నారు. రాజకీయ నాయకులకు పాదయాత్రలు బాగా కలిసొస్తాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాదయాత్ర ద్వారా హుజూరాబాద్ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ఈటల ప్లాన్ చేస్తున్నారు.

ఓ వైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈటల సైతం హుజూరాబాద్ పరిధిలో పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. 22 రోజుల పాటు 125 గ్రామాల్లో 350 కిలోమీటర్ల మేర ఈటల పాదయాత్ర ఉండనుంది. అంటే హుజూరాబాద్‌లో ప్రతి గ్రామం టచ్ అయ్యేలా ఈటల పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర తన గెలుపుకు తొలిమెట్టు అని ఈటల భావిస్తున్నారు.

అలాగే ఈటలకు మద్ధతుగా కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఆ విషయం స్వయంగా ఈటలనే చెప్పారు. ఇలా హుజూరాబాద్‌లో అన్నీ రకాలుగా బలపడి ఉప ఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా ఈటల ముందుకెళుతున్నారు. మరి ఈటల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.