హుజురాబాద్ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆయన అనవసరంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఇలా చేయడం ఆయనకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. అసలు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఆయన గ్రాఫ్ తగ్గిపోతుందని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కు చెప్పారని కావున ఆయనకు ఉప ఎన్నికల్లో టికెట్ వస్తుందా? లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ పోటీ చేసినా పరిస్థితులు మాత్రం కౌశిక్ రెడ్డి అనుకూలంగా ఉండవని చెబుతున్నారు. కాగా కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేటపుడు కాంగ్రెస్ నాయకులను, నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేఖించారు. ఇలా చేయడం వల్ల ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ లోకి పోయే చాన్స్ లేదని అంటున్నారు. మాజీ పీసీసీ ఛీఫ్ తమ్ముడవడం వల్లే తనకు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ లభించిందని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కౌశిక్ భవిష్యత ఎటూ అర్థం కాని అంధకారంలో ప్రశ్నార్థంగా మారిందట. ఎందుకంటే టీఆర్ఎస్ తరఫున ఆయనకు హుజురాబాద్ టికెట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు. టికెట్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం కేవలం సీఎం కేసీఆర్ కే వదిలిపెడుతున్నట్లు పేర్కొంటున్నారు. కౌశిక్ రెడ్డి ఒక వేళ టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు శాప్ చైర్మన్ పదవి దక్కొచ్చని అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి మాజీ క్రికెటర్ కూడా కావడం ఇందుకు కలిసొచ్చే ఆంశమని వారు చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61 వేల ఓట్లు పోలయ్యాయి. కానీ ప్రస్తుతం పోటీ చేస్తే ఆ మేరకు కూడా వస్తాయో లేదో అని పలువురు చెబుతుండడం గమనార్హం. కాంగ్రెస్ కు రాజీనామా చేసినంత మాత్రాన విమర్శించాల్సిన అవసరం లేదని అంటున్నారు.