ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో రెండే హాట్ టాపిక్స్ బాగా హల్చల్ చేస్తున్నాయి. ఒకటి టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, హుజూరాబాద్‌లో సత్తా చాటుతారా లేదా? రెండు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పదవి ఎవరికి దక్కుతుంది. కాసేపు ఈటల ఎపిసోడ్‌ని పక్కనబెడితే, ఈ తెలంగాణ పీసీసీ పదవి వ్యవహారం సీరియల్ మాదిరిగా ఎప్పటినుంచో నడుస్తుంది.
పీసీసీ పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోవడంతో, ఆ పదవి ఎవరికి దక్కుతుందనే విషయం గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీలో ప్రజాక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా పీసీసీ తేల్చుకునే పనిలో ఉంది. అసలు ఈ పదవి వ్యవహారం ఎప్పుడో తేలిపోవాలి. కానీ నాగార్జున సాగర్ ఉపఎన్నిక రావడంతో బ్రేక్ పడింది.
అయితే ఆ ఉపఎన్నిక అయ్యి కూడా చాలా రోజులు అయింది. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పీఠం ఎవరికి అనేది తేల్చడం లేదు. ఇప్పటికే పీసీసీ పదవి రేవంత్ రెడ్డి కి ఖాయమని ప్రచారం జరిగిపోయింది. ఇక రేవంత్‌కు పదవి రాకుండా సీనియర్లు అడ్డుపడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. వి. హనుమంతరావు లాంటి వారైతే బహిరంగంగానే రేవంత్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఇక రేవంత్ కాకుండా పీసీసీ రేసులో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అటు జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్ లాంటి వారు సైతం తాము పీసీసీ రేసులో ఉన్నామని చెబుతున్నారు.
అందరూ రేసులోనే ఉన్నారు. కానీ ప్రజల్లో ఎవరు ఉండటం లేదు. ఫలితంగా కాంగ్రెస్‌ని సైతం ప్రజలు పట్టించుకునేలా కనబడటం లేదు. ఎంతసేపు వీరు పదవి కోసం కొట్లాడుతున్నారు తప్ప, ప్రజల కోసం కొట్లాడటం లేదు. దీంతో నిదానంగా కాంగ్రెస్‌ని ప్రజలు పక్కన పెట్టేశాలా కనిపిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం త్వరగా పీసీసీని తేల్చి, ప్రజల్లోకి ఎప్పుడు పంపిస్తుందో చూడాలి.