ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలోధర్నా చేస్తున్న జగన్ కి ఇండి కూటమి దగ్గరవుతోందా అంటే అవుననే అంటోంది నేషనల్ మీడియా. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాకు ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలు మద్ధతు పలుకుతున్నారు. ధర్నా తొలిరోజు పలువురు నేతలు సంఘీభావంగా నిలిచిన సంగతి తెలిపిందే. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన పార్టీ నేతలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, ముస్లిం లీగ్ నేతలు జగన్ కు సంఘిభావం తెలిపిన వారిలో ఉన్నారు. ఇక రెండో రోజు కూడా మరికొన్ని పార్టీలు మద్ధతు తెలుపనున్నాయని సమాచారం అందుతోంది. ఇండియా కూటమిలో మరోపెద్ద పార్టీగా ఉన్న డిఎంకే పార్టీ నేతలు ఇవాళ జగన్‌కు మద్ధతుగా నిలువనున్నారని తెలుస్తోంది. దీంతో జగన్‌కి ఇండియా కూటమికి దగ్గరవుతోందనే వార్తలు వస్తున్నాయి.
ఎన్నకల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతుగా ఉన్నారు.పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించే సమయంలో వైసీపీ.. బీజేపీ విధానాలకు మద్దతిస్తూ ఇతర పార్టీలను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభలో జరిగిన స్పీకర్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టారు. తన ప్రత్యర్ధులు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీకే మద్దతు ప్రకటించారు జగన్. దీనిపై అనేక విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.
కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని ముందుగానే ప్రకటించారు. జగన్ తీరుపై ఢిల్లీ రాజకీయవర్గాల్లో సైతం ఆసక్తికర చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు ఇండి కూటమి పార్టీల్ని తనకు మద్దతు తెలియచేయాలని జగన్ ఆహ్వానించడం.. అందుకు అనుగుణంగానే ఆయా పార్టీలు సంఘీభావంగా నిలవడం చకచకా జరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమిలోని కీలక పార్టీలకు చెందిన నేతలు జగన్ ధర్నాకు సంఘిభావం తెలియచేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో జగన్ కి ఇండి కూటమి దగ్గరవుతోందని అని టాక్ నడుస్తోంది.
కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌కి లోక్‌సభలో మరింతగా బలం కావాల్సి ఉంది. త్వరలోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నిలబెట్టే అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే ఆ పార్టీకి తగినంత మంది ఎంపీల సంఖ్య అవసరం. ఇలాంటి నేపథ్యంలో లోకల్ పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడాల్సివస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా మద్ధతు తెలుపుతున్నాయని సమాచారం. ముందుగా భాగస్వామ్య పార్టీలతో సంఘీభావం ప్రకటించి చివరికి కాంగ్రెస్ కూడా జగన్ వద్దకు వస్తుందని టాక్ నడుస్తోంది. దీనిని బట్టి చూస్తే వైసీపీని కూడా ఇండి కూటమిలోకి తీసుకునేందుకు ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు అంటున్నారు. ఇవాళ రేపు ధర్నా కొనసాగనున్న నేపథ్యంలో ఎవరెవరు జగన్‌కు మద్ధతు ఇస్తారోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది.