మంత్రి అనీల్ కి షాక్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు…!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడు రోజు రోజుకి తారా స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా జిల్లా వైసీపీ నేతలు ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారారు. అనవసర పెత్తనాలు చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్నా సరే వాళ్ళ తంతు ఇప్పుడు చికాకుగా మారింది. ఎంపీ నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవి మధ్య విభేదాలు ఉన్నాయి.

అవి ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకుంటున్నా తరుణంలో మరో గొడవ బయటపడింది. విడదల రజని, లావు కృష్ణ దేవరాయలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. మంత్రి అనీల్ కి కర్నూలు జిల్లా కార్యకర్తలు ఊహించని షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గంలో ఇప్పటికే విభేదాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే ఆర్ధర్, నియోజకవర్గ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. వాటికి అనీల్ మరింత ఆజ్యం పోశారు తాజాగా. నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తమ వర్గానికి కాకుండా సిద్ధార్థ్ రెడ్డి వర్గానికి ఇచ్చేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని భావించిన ఎమ్మెల్యే వర్గీయులు, నియోజకవర్గంలో ఒక సమావేశానికి వచ్చిన అనీల్ కి వార్నింగ్ ఇచ్చారు.

నందికొట్కూరు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కర్నూలు జిల్లాలో అడుగుపెట్టనీయబోమని ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు బహిరంగ వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే ఎమ్మెల్యే అర్థర్‌తో పాటు సిద్ధార్థ్ రెడ్డితో మాట్లాడేందుకు పార్టీ పెద్దలు సిద్దమవుతున్న తరుణంలో ఏకంగా మంత్రికి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే అనుచరులు. దీనితో ఇప్పుడు అసలు నందికోట్కూరు లో ఎం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.