ఫస్ట్ కాజ్ : రానున్న ఎన్నికల్లో కొత్త వ్యూహకర్తతో పనిచేసేందుకు వైసీపీ చీఫ్ జగన్ సన్నద్ధం అవుతున్నారు. ఇదే ఐ ప్యాక్ బృందంలో కొందరు అటు తెలంగాణలో వైఎస్ఆర్టీపీకీ సాయం అందించనున్నారు అని తెలుస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ సారి కూడా కార్పొరేట్ పాలిటిక్స్ మాత్రమే కీలకం కానున్నాయి. కొన్ని రాజకీయ శక్తుల ఎదుగుదలకు అవే బలం అందించనున్నాయి. తెర వెనుక ఉండి రాజకీయం చేయనున్నాయి. దేశంలో జాతీయ పార్టీలను నడిపే విధంగానే, రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలకు అవి నిండుగా, మెండుగా అండదండలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నా.. ఈ సారి టీడీపీ కన్నా వేగంగానే వైసీపీ వ్యూహకర్తల నియామకంలో ముఖ్యంగా కార్పొరేట్ లాబీయింగ్-లో ముందుందని కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఆ విధంగా ఓ రాజకీయ పార్టీ ఎదుగుదల అన్నది అటు కార్పొరేట్ కంపెనీల పైనా అదేవిధంగా కొన్ని మీడియా శక్తుల పైనా, కొంత మేర విదేశీ నిధుల పైనా ఆధారపడి గతంలోనూ రాజకీయాలు నడిచేయి. కాంగ్రెస్ మార్కు రాజకీయం అంతా ఒకప్పుడు ఈ విధంగానే ఉండేది. తాజాగా వైసీపీ మరీ ఇంతలా కాకపోయినా, వీలున్నంత మేరకు ప్రత్యర్థి పార్టీల నిలువరింతకు కార్పొరేట్ శక్తుల సాయం పొందాలనే భావిస్తున్నది అని తెలుస్తోంది.
ఇదే ఐ ప్యాక్ లో కొందరు విడిపోయి టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకూ సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ అవేవీ పూర్తి స్థాయిలో లేవు. కొన్ని నెలల వరకూ పనిచేసి తరువాత వాళ్లతో ప్యాక్ అప్ చెప్పించేశారు. సునీల్ అనే ఐ ప్యాక్ మెంబర్ టీడీపీకి ఆ మధ్య కొంత కాలం పనిచేసి, తరువాత తప్పుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ముందు ప్రశాంత్ కిశోర్ టీం ను వద్దనుకున్నా ఎందుకనో వాళ్లనే ఎంచుకుని రాజకీయం చేసేందుకు సమాయత్తం అవుతోంది.
వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచి వ్యూహకర్తలను రంగంలోకి దింపుతోంది. పార్టీ తరఫున పనిచేసేందుకు, పార్టీకి సంబంధించిన అభ్యర్థుల బలాబలాలను తేల్చేందుకు వైసీపీ తరఫున ఓ టీం కృషి చేయనుంది. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ క్లుప్తంగా ఐ ప్యాక్ పేరిట ప్రశాంత్ కిశోర్ మనుషులే జగన్ తరఫున పనిచేయనున్నారు. ఈ మేరకు రంగంలోకి రేపటి నుంచి కొత్త వ్యక్తి ఒకరు దిగనున్నారు. ఆయన పేరు రిషి రాజ్ సింగ్. రేపటి నుంచి ఆయన పార్టీ తరఫున వర్క్స్ మొదలుపెడతారు.