Praja Palana : ఆరు గ్యారెంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. అభయహస్తం కింద ఇప్పటివరకు కోటి ఎనిమిది లక్షల 94 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పింఛన్లు, గృహలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్ల,రేషన్ కార్డులు కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం,రేషన్ కార్డులు, రూ.500కే సిలిండర్,రూ.5లక్షల యువ వికాసం,రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా,రూ.4వేల పింఛన్లు, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది.గత నెల 28వ తేదీ నుంచి ఈరోజు సాయంత్రం వరకు అభయహస్తం అప్లికేషన్లు స్వీకరించారు.