ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ సమస్య ఇంకా తీరలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ విషయంలో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధం అయ్యారు. శనివారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో సమావేశం అయ్యాయి. సందర్భంగా ఉపాధ్యాయులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణను కూడా ప్రకటించాయి. ఈ కార్యాచరణ ప్రకారం.. ఈ నెల 14, 15 తేదీలలో ముఖ్య మంత్రి జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తారు.
తర్వాత 15వ తేదీ నుంచి 20 వరకు పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. 21వ తేదీ నుంచి 24 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లతో బ్యాలెట్లు నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యే లకు విజ్ఞాప్తులు చేస్తారు. 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ పై బహిరంగ లేఖ రాస్తారు. తర్వాత మార్చి నెలో 2, 3 తేదీలలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ కార్యాచరణ గురించి ఈ నెల 14వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసు ఇవ్వనున్నారు.