శ్రీలంక వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నారు. వారికి టెస్టు జట్టులో చోటుకల్పిస్తున్నట్లు సోమవారం బీసీసీఐ తెలిపింది. ఇంగ్లాడ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి గాయాల కారణంగా శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ జట్టు నుంచి వైదొలిగారు. వీరి స్థానంలో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ఆడుతాడని స్పష్టం చేసింది.
బౌలింగ్ చేసే వేలికి గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టెస్టు జట్టు నుంచి వైదొలిగాడు. సుందర్ కుడి చేతి వేలికి ఇంజెక్షన్ ఇచ్చారు. అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం సుందర్ బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు అని బీసీసీఐ తెలిపింది.
అవేశ్ ఖాన్ బొటన వేలుకు ఫ్యాక్చర్ కావడంతో అతడిని ప్రాక్టీస్ కూడా అనుమతించలేదు. మొదటి రోజు వార్మ్ అప్ మ్యాచ్ సమయంలో ఫాస్ట్ బౌలర్ అవేశ్ కాన్ ఎడమ చేతి బొటనవేలుకు గాయమైంది. ఆతర్వాత తీసిన ఎక్స్‌రేలో ఫ్యాక్చర్ అయినట్లు నిర్ధారణ అయిందని బీసీసీఐ పేర్కొంది.
న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో ఎడమ కాలు కింది భాగంలో గాయం తీవ్రం కావడంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. ఇప్పటికే అతను భారత్‌కు తిరిగి వచ్చినట్లు బీసీసీఐ నిర్ధారించింది.