ఓ చిన్నారిని బలి తీసుకున్న మంత్రి ఊరేగింపు

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే.అయితే మంత్రి పదవి వచ్చిన వారి ఊరేగింపులు జనాల ప్రాణాలమీదకు తెస్తున్నాయి.కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో చేపట్టిన విజయోత్సవ ర్యాలీలు స్థానికంగా రాజకీయ సందడి నెలకొనేలా చేస్తున్నాయి.ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త మంత్రి గారి ఊరేగింపులో పోలీసులు మరీ కర్కశంగా వ్యవహరించడంతో ఓ చిన్నారి నూరేళ్ళ జీవితం బలైంది.

వివరాల్లోకి వెళితే..సత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్..మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కళ్యాణదుర్గం వచ్చారు.దీంతో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.కళ్యాణదుర్గంలో మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ -ఈరక్క దంపతులు తమ చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక 108కు ఫోన్ చేశారు.అయినా రాకపోవడంతో బైక్ పై ఎక్కించుకుని (ఆర్ జి టి) ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు.వారు కళ్యాణదుర్గం చేరుకున్న తర్వాత పోలీసులు వాహనాలను నిలిపివేశారు.

అయితే పాపని ఆసుపత్రికి తీసుకెళ్లాలని…వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ పోలీసులను వేడుకున్నారు వినలేదు. అరగంటపాటు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది.ఊరేగింపు తరువాత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా…అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. కొంచెం ముందు తీసుకువచ్చినా పాపను బతికించే వాళ్ళమని చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.మంత్రి ఊరేగింపు కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది అంటూ పాప తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version